జన్మభూమి 2.ఓ.. ఆ పేరు వింటేనే..!

గతంలో జన్మభూమి కమిటీల పేరుతో పార్టీ నేతలు ప్రభుత్వ నిధుల్ని దోచుకున్నారనే ఆరోపణ ఉంది. నీరు-చెట్టు లాంటి పనులు కేవలం పార్టీ నేతల కోసమే చేపట్టారనే విమర్శలూ ఉన్నాయి.

Advertisement
Update:2024-08-21 11:00 IST

జన్మభూమి కార్యక్రమంపై చంద్రబాబుకి పేటెంట్ హక్కు ఉంది, కాదనలేం. కానీ 2019 నుంచి 2024 వరకు ఏపీలో జన్మభూమి అనే పేరే వినపడలేదు. పోనీ పాలనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అంటే అదీ లేదు. గ్రామ, వార్డు సచివాలయాలతో పాలన సజావుగా, ఇంకా చెప్పాలంటే గతంకంటే మెరుగ్గానే సాగింది. ఎక్కడా ఏ పథకం ఆగలేదు, రద్దుకాలేదు. అలాంటప్పుడు మళ్లీ జన్మభూమి ఎందుకు..? కొత్త వెర్షన్ 2.ఓ అంటూ ఈ చర్చలేంటి..? జన్మభూమి అనే పేరు వింటనే రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది వణికిపోతున్నారు.

గతంలో చంద్రబాబు జన్మభూమి, శ్రమదానం పేరుతో ఉద్యోగుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలున్నాయి. మళ్లీ వింటేజ్ చంద్రబాబుని చూస్తారంటూ ఆయన పదే పదే చెబుతుంటే ఆ పాత రోజులు చాలామందికి గుర్తొస్తున్నాయి. అందులోనూ జన్మభూమి అంటూ ఆయన పాత పథకాలను కొత్తగా తెరపైకి తేవాలనుకుంటున్నారు. 2025 జనవరి నుంచి జన్మభూమి 2.ఓ ప్రారంభింస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

ఎందుకీ జన్మభూమి 2.ఓ..?

వచ్చే ఐదేళ్లలో గ్రామాల్లో 17,500 కిలోమీటర్ల మేర సిమెంట్‌ రోడ్లు, 10 వేల కిలోమీటర్ల మేర డ్రైనేజీ కాల్వలు నిర్మిస్తామని, జన్మభూమి కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అంటున్నారు సీఎం చంద్రబాబు. ఆర్థిక శాఖ నిధులతోపాటు, జల్‌జీవన్‌ మిషన్‌ పథకం అమలు కోసం రాష్ట్ర వాటాని వెంటనే విడుదల చేస్తామంటున్నారు. కేంద్రం ఇచ్చే నిధులను కూడా సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ తాగునీరు అందిస్తామన్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో 2,500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, 5 లక్షల ఫామ్‌పాండ్స్‌ తవ్వేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు.

అంతా బాగానే ఉంది కానీ, దీనికి జన్మభూమి అనే పేరు పెట్టడం, స్థానికులను కూడా భాగస్వాముల్ని చేస్తామనడం, నిధులు సమీకరిస్తామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో పార్టీ నేతలు ప్రభుత్వ నిధుల్ని దోచుకున్నారనే ఆరోపణ ఉంది. నీరు-చెట్టు లాంటి పనులు కేవలం పార్టీ నేతల కోసమే చేపట్టారనే విమర్శలూ ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ జన్మభూమి అంటున్న చంద్రబాబు, ఈసారి కూడా పార్టీ నేతలకు ఉపయోగపడే పనులే చేపడతారా.. నిజంగానే దీని వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందా..? అనేది వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News