పవన్ భార్యపై అసభ్యకర కామెంట్లు.. ఆందోళనకు దిగిన వీరమహిళలు
సాక్షి మీడియా సహా మరికొన్ని ట్విట్టర్ల అకౌంట్ల పేర్లను ప్రస్తావిస్తూ జనసేన లీగల్ సెల్ విభాగం ఓ లిస్ట్ విడుదల చేసింది. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
పవన్ కల్యాణ్, అన్నా లెజ్నోవా విడిపోయారంటూ ఇటీవల కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అదంతా తప్పుడు ప్రచారమంటూ జనసైనికులు కొట్టిపారేశారు. స్వయానా జనసేన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పవన్ దంపతులు కలసి ఉన్న ఫొటో బయటకు రావడంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని అనుకున్నారంతా. కానీ అక్కడినుంచి మరో వివాదం మొదలైంది. అది పాత ఫొటో అని కొందరు, మార్ఫింగ్ చేశారని మరికొందరు, వీడియో పెట్టాలని ఇంకొందరు కామెంట్లు చేశారు. పవన్ భార్యపై ట్రోలింగ్ మొదలైంది. వైసీపీ ప్రతినిధుల అధికారిక ట్విట్టర్ అకౌంట్ల నుంచి కూడా కౌంటర్లు మొదలయ్యాయి. దీంతో జనసేన సీరియస్ గా రియాక్ట్ అయింది. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జనసేన లీగల్ సెల్ హెచ్చరికలు జారీ చేసింది.
సాక్షి మీడియా సహా మరికొన్ని ట్విట్టర్ల అకౌంట్ల పేర్లను ప్రస్తావిస్తూ జనసేన లీగల్ సెల్ విభాగం ఓ లిస్ట్ విడుదల చేసింది. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు జనసేన వీర మహిళ విభాగం నేతలు నేరుగా డీజీపీని కలసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అసభ్యకరమైన ట్వీట్లు వేసేవారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే డీజీపీని కలిసేందుకు అనుమతివ్వకపోవడంతో వారు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.
పవన్ కల్యాణ్ వివాహాల విషయంలో గతంలో కూడా వైసీపీ దూకుడుగా విమర్శలు చేసేది. ఇటీవల స్వయానా సీఎం జగన్, పవన్ పెళ్లిళ్లపై జోకులేశారు. ఇక వైసీపీ నాయకులు ఊరుకుంటారా..? అధినేతే అంత సీరియస్ కామెంట్లు చేసే సరికి వైసీపీ అనుకూల ట్విట్టర్ హ్యాండిల్స్ లో మరింత ఘాటు విమర్శలు మొదలయ్యాయి. అన్నా లెజ్నోవా ఫొటో బయట పెట్టిన తర్వాత ఆ రచ్చ మరింత పెరిగింది. దీంతో జనసేన ఇప్పుడు సీరియస్ గా రియాక్ట్ అవుతోంది.