పోలింగ్‌కు ముందే ఘోరమైన ఓటమి..! ఇది ఒక్క పవన్ కళ్యాణ్‌కే సాధ్యం!!
తెలుగుదేశం కొమ్ముకాసినందుకు, చంద్రబాబుని భుజాన మోసినందుకు జనసేనకి 50–40 సీట్లన్నా వస్తాయని అందరూ అనుకున్నారు. 30 అసెంబ్లీ స్థానాలయితే ఖాయం అని జనసేన కార్యకర్తలు ఆశించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుంది. జగన్మోహన్‌రెడ్డి అండ్ కో సంబరం చేసుకుంటుంది. లేదా తెలుగుదేశం పార్టీ గెలిచి చూపిస్తుంది. చంద్రబాబు నాయుడు, ఆయన మద్దతుదార్లు పండగ చేసుకుంటారు. దీన్నే కదా ప్రజాస్వామ్యం అంటున్నాం. బీజేపీ అక్కడ కొన్ని సీట్లు గెలవొచ్చు... గెలవకపోనూవచ్చు. అసలు చమత్కారం ఎక్కడ ఉందంటే.. అరుపులూ కేకలతో ప్రచార సభల్లో హెరెత్తించిన పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందే ఘోరంగా ఓడిపోవడం..!
తెలుగుదేశం కొమ్ముకాసినందుకు, చంద్రబాబుని భుజాన మోసినందుకు జనసేనకి 50–40 సీట్లన్నా వస్తాయని అందరూ అనుకున్నారు. 30 అసెంబ్లీ స్థానాలయితే ఖాయం అని జనసేన కార్యకర్తలు ఆశించారు. పవన్, బాబుల ఒప్పందం ఏమిటో, లాలూచీ ఎలాంటిదో తెలీదు కానీ కేవలం 24 సీట్లకే పవర్ స్టార్ లొంగిపోయారు. దాంతో అయన్నే నమ్ముకున్న జనం కుంగిపోయారు. మూడు పార్లమెంట్ సీట్ల ముష్టిపడేశారు. అయిందా..? చంద్రబాబూ, పవన్ చెట్టాపట్టాలు వేసుకుని ఢిల్లీ వెళ్లొచ్చారు. ‘పొత్తు పొడిచింది’ ‘కూటమి గెలుస్తోంది’ అంటూ బడాయి కబుర్లు చెప్పారు. బీజేపీలో సీట్ల సర్దుబాటు అంటే నాలుగు రోజులు కాలయాపన. కట్ చేస్తే ఏమైంది..?
పవన్ కళ్యాణ్‌కి మూడు సీట్లు కట్ అయ్యాయి. జనసేనకి 21 సీట్లు మాత్రమే అంటున్నారిప్పుడు. ఈ దారుణమైన అవమానాన్నీ మహా ప్రసాదంగా స్వీకరించాడు పవన్. తప్పులేడు. ఆయన పార్టీ ఆయనిష్టం..! అయినా లెక్కలెక్కే, మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు. 88 వస్తేనే ఒక పార్టీ గెలిచినట్టు. తొంభై, వంద మధ్య స్థానాలు తెచ్చుకో గలిగితేనే అధికారంలో నిలబడ గలిగినట్టు. పెద్ద పార్టీ తెలుగుదేశం 144 చోట్ల పోటీ చేస్తుంది. జనసేనకి 21 సీట్లు.
కొత్తగా కొమ్మలొచ్చిన బీజేపీ పది స్థానాల్లో పోటీ చేస్తుంది. గత ఎన్నికల్లో పట్టుమని ఒక్క శాతం ఓట్లు కూడా పొందని బీజేపీకి పది స్థానాలు ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ వ్యవహారం పూర్తిగా వేరు. ఆయనో మోస్ట్ గ్లామరస్ హీరో. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద కులానికి ప్రతినిధి. కాపు, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, తెలగ కులాల్లో ఎక్కవ మంది పవన్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఆశపడ్డారు. పవన్‌కి ఉన్న జనాకర్షణశక్తిని శత్రువులు కూడా కాదనలేరు. అలాంటప్పుడు, కేవలం 21 సీట్లకి ఒప్పుకోవడం ఎలా సమర్థనీయం..?
రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అంతటా విస్తరించి ఉన్న కాపులు, కనీసం వంద నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేయగలరు. 21 సీట్లు విసిరేసిన పాపానికి మేము మిమ్మల్ని వంద స్థానాల్లో గెలిపించాలా..? అని కాపులు గట్టిగానే అడుగుతున్నారు.
చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం ఏమన్నారు..? అధికారంలో భాగస్వామ్యం ఉండాలి, కనీసం మనకి అరవై సీట్లన్నా ఇవ్వాలి. 15 శాతానికి పైగా ఉన్న కాపుల ఓటింగ్ బలాన్ని లెక్కలోకి తీసుకుంటే, వాళ్ల సూచన న్యాయంగా ఉన్నట్టేగా. ‘కాపు సీఎం’ అని బీజేపీ ఊరికినే అనలేదు కదా..! మరి పవన్‌కి ఈ ఖర్మ ఎందుకు పట్టినట్టు. కాపు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, కమ్మ పెట్టుబడిదారుల ప్రతినిధి అయిన చంద్రబాబుని గెలిపించడానికి మనం ఎందుకు ఇంత త్యాగం చేయాలి..? కేవలం జగన్మోహన్‌రెడ్డి మీద కక్షతోనా..? జగన్ కేబినెట్‌లో అయిదారుగురు కాపు మంత్రులున్నారు. పేరున్న నాయకుడు ముద్రగడ, కుమారునితో సహా వైసీపీలో చేరారు. మరిప్పుడు, మనం కమ్మ పల్లకీ మోయడం అంటే కందకి లేని దురద కాపుకి ఎందుకు..? ఏం సాధించడానికి..? అసలు, సొంతబలం మీద రాష్ట్రంలో అన్ని చోట్లా జనసేన పోటీ చేస్తే కాపుల బలం ఎంతో సమాజానికి తెలిసేది కదా అని అనేవాళ్లూ ఉన్నారు. సమాజం అంటే – పెద్ద సంఖ్యలో బీసీలు ఉన్నారు. బలమైన శక్తిగా దళితులున్నారు.
అటు ముస్లింలు – ఇటు క్రిస్టియన్లు సత్తా చూపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కోట్లాది జనాన్ని కాదనుకొని చంద్రబాబుతో లాలూచీ పడడం, బాబు కోసం బీజేపీ పెద్దల కాళ్ల మీద పడడం – పవన్ కళ్యాణ్ చెయ్యాల్సిన పనేనా..? హీనమైన బానిసత్వం అంటే ఇదేగా..! కాపుల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టి, కమ్మ నాయకులతో తైతక్కాలాడడం వీరమల్లుడికే చెల్లుతుందా, హరిహరా..! ఎంత దౌర్భాగ్యం..!
కాపుల్ని దిష్టిబొమ్మల్ని చేసి, వాటిపై తెలుగుదేశం పెట్రోలు పోసి, బీజేపీ వారి అగ్గిపుల్లతో వెలిగించడం – మహోన్నతమైన త్యాగం అవుతుందా..? ‘ఆత్మహత్య’గా చరిత్ర ప్రసిద్ధి చెందుతుందా..?