అర్జీల రూపంలో దాడులు.. ఇంటెలిజెన్స్ లీకులపై జనసేన ఆగ్రహం
టెక్కలిలో జనసేన కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు నాదెండ్ల మనోహర్. అధికార పార్టీ, పోలీసులను సొంత ప్రయోజనాలకు వాడుకుంటోందని అన్నారు.
ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. జనసేన నాయకులు, కార్యకర్తలు.. అర్జీలు ఇవ్వడానికి అన్నట్టుగా వచ్చి దాడి చేసే అవకాశముందని వైసీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఎవరెవరికి ప్రమాదం ఉందో ఓ లిస్ట్ కూడా బయటకొచ్చింది. అయితే రహస్యంగా ఉండాల్సిన ఇలాంటి సమాచారం అసలు బయటికెలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు. ఓ వ్యూహం ప్రకారం జనసేనపై నిందలు వేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ నేతలపై జనసేన వర్గాలు దాడులు చేస్తాయని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేనకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక వైసీపీ ఇలాంటి కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. డీజీపీ కార్యాలయ వర్గాల నివేదిక ఆధారంగా మీడియా వార్తలు ఇస్తోందని, రహస్యంగా ఉంచాల్సిన నివేదిక ఎలా బయటకు వచ్చిందో డీజీపీ చెప్పాలని నిలదీశారు. రహస్య నివేదిక లీక్ కావడంపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జనసేన నాయకుల ఫోన్లపై ఏపీ పోలీసులు నిఘా పెట్టారని, తమ ఫోన్లపైనే కాకుండా ఇలాంటి వ్యవహారాలపై కూడా పోలీసులు నిఘా ఉంచాలని డీజీపీకి సలహా ఇచ్చారు నాదెండ్ల మనోహర్. విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అది ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. టెక్కలిలో జనసేన కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అధికార పార్టీ, పోలీసులను సొంత ప్రయోజనాలకు వాడుకుంటోందని అన్నారు. జనసేన నాయకులు దాడులకు పాల్పడతారన్న నివేదికలు పూర్తిగా అవాస్తవం అని చెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో తమ పార్టీని తక్కువచేయలేరని స్పష్టం చేశారు.