ఏపీలో బీఆర్ఎస్ దెబ్బ.. జనసేన అబ్బ

జనసేన కీలక నేత, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు స్పష్టమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో రేపు మధ్యాహ్నం 12గంటలకు తెలంగాణ భవన్ లో ఈ చేరికలు ఉంటాయని చెబుతున్నారు.

Advertisement
Update:2023-01-01 17:55 IST

ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది..? ఆ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి..? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే బీఆర్ఎస్ లో చేరికలకు టైమ్ దగ్గరపడింది. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. బీఆర్ఎస్ ఏపీపై ఫోకస్ పెడుతుందని అనుకున్నా.. అంతకు ముందే ఆ హడావిడి కనిపిస్తోంది. కొత్త ఏడాదిలో ఏపీ నుంచి భారీగా చేరికలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. జనసేన కీలక నేత, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు స్పష్టమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో రేపు మధ్యాహ్నం 12గంటలకు తెలంగాణ భవన్ లో ఈ చేరికలు ఉంటాయని చెబుతున్నారు.

చంద్రశేఖర్ తో పాటు ఎవరెవరు..?

టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. చంద్రశేఖర్ తో పాటు రేపే రావెల కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారని సమాచారం. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ కి కాపు వర్గంలో మంచి పలుకుబడి ఉంది. 2014లో వైసీపీ తరపున, 2019లో జనసేన తరపున పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరబోతున్నారు.

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్..

తోట చంద్రశేఖర్ కి బీఆర్ఎస్ ఏపీ విభాగం అధ్యక్ష పదవి అప్పగిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఆయనకు పదవి ఇస్తే కాపు సామాజిక వర్గం నుంచి మరిన్ని చేరికలుంటాయని అంటున్నారు. ఇప్పటికే ఏపీలో రెండు ప్రధాన సామాజిక వర్గాలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి. మధ్యలో కాపులకు జనసేన ఆశలు రేకెత్తించినా, పవన్ చివరికి చంద్రబాబుకే జై కొడతారనే అపవాదు కూడా ఉంది. ఈ దశలో కాపులకు ప్రత్యామ్నాయంగా ఏపీలో బీఆర్ఎస్ ఎదిగితే జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే లెక్క.

అమరావతిలో కార్యాలయం..

రాజధాని అమరావతి ప్రాంతంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అద్దె భవనాన్ని కూడా కేసీఆర్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు.

యువత కూడా..

యువత కూడా బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నట్టు తెలుస్తోంది. ఒంగోలులో ఆంధ్రప్రదేశ్‌ యూత్ విద్యార్థి సంఘం బీఆర్‌ఎస్‌ కు మద్దతు ప్రకటించింది. దేశంలో మతోన్మాద బీజేపీని ఎదుర్కొనే శక్తి ఒక్క బీఆర్‌ఎస్‌ కు మాత్రమే ఉందని, ఏపీలో ప్రతి ఒక్కరూ బీఆర్‌ఎస్‌ కు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని విద్యార్థి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మొత్తమ్మీద ఏపీలో బీఆర్ఎస్ అలజడి మామూలుగా ఉండదని స్పష్టమవుతోంది. ప్రధానంగా జనసేనపై ఆ ప్రభావం ఎక్కువగా కనపడేలా ఉంది.

Tags:    
Advertisement

Similar News