మధ్యలో పవన్ ఇరుక్కుపోయారా?
పవన్ మద్దతు లేకుండా ఎన్నికలకు వెళ్ళలేని పరిస్ధితి చంద్రబాబునాయుడుది. ఇదే సమయంలో పవన్ లేకుండా అడుగు కూడా ముందుకు వేయలేకపోతోంది బీజేపీ.
ఏపీ రాజకీయాలు భలే విచిత్రంగా తయారవుతున్నాయి. ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో తెలీదు. మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీలు ఎన్నికల వరకు కలిసుంటాయో లేదో ఎవరు చెప్పలేరు. మిత్ర పక్షాలతో మూడో పార్టీ ఏదన్నా కలుస్తుందో లేదో తెలీదు. తమతో టీడీపీని కలుపుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబును దూరంగా ఉంచాలని బీజేపీ గట్టిగా పట్టుబడుతోంది.
పొత్తులు తేలితే తమ భవిష్యత్తు తేలుతుందని సీపీఐ ఎదురుచూస్తోంది. అలాగే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో తేల్చుకోలేక సీపీఎం అవస్తలుపడుతోంది. ఇన్ని పార్టీల మధ్య తమ పరిస్ధితి ఏమిటో తెలియక కాంగ్రెస్ అయోమయంలో ఉంది. ఇన్ని కాంబినేషన్లు, కన్ఫ్యూజన్ల మధ్య కూల్‌గా ఉన్నది వైసీపీ మాత్రమే. తమకు ఎవరితోనూ పొత్తు లేదు ఒంటరిగానే తేల్చుకుంటామని జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి చెబుతున్నారు.
అయితే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను బేరీజు వేసుకుంటే అర్ధమవుతున్నది ఏమిటంటే రెండు పార్టీల మధ్య జనసేన అధినేత పవన్ ఇరుక్కుపోయారని. పవన్ మద్దతు లేకుండా ఎన్నికలకు వెళ్ళలేని పరిస్ధితి చంద్రబాబునాయుడుది. ఇదే సమయంలో పవన్ లేకుండా అడుగు కూడా ముందుకు వేయలేకపోతోంది బీజేపీ. పవన్ పల్లకి మోస్తే అందులో కూర్చోవాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ఇదే సమయంలో పవన్ భుజానెక్కి ఊరేగాలని బీజేపీ కోరుకుంటోంది. పవన్ లేకుండా ఎన్నికలకు వెళితే టీడీపీకి చాలా నష్టం. ఇదే సమయంలో పవన్ లేకుండా ఎన్నికలకు వెళితే బీజేపీకి పట్టుమని వంద ఓట్లు కూడా పడవు.
పై రెండు పార్టీల సమస్యలు ఒకటైతే పవన్ సమస్య మరోరకంగా ఉంది. అదేమిటంటే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళితే గెలుస్తామని అనుకుంటున్న సీట్లలో కూడా జనసేన ఓటమి తప్పదని అనుమానిస్తున్నారు. ఎందుకంటే బీజేపీకి జనసేన ఇచ్చే ప్రతి సీటు ఓడిపోవటమేనని పవన్ అనుకుంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే జనసేనతో పొత్తు పెట్టుకుంటే వదులుకునే సీట్లలో చాలా వాటిలో వైసీపీనే గెలుస్తుందని తమ్ముళ్ళు అనుకుంటున్నారు. చివరకు ఏమవుతుందో తెలియదుకానీ టీడీపీ-బీజేపీ మధ్య పవన్ బాగా ఇరుక్కుపోయినట్లే అనిపిస్తోంది.