మైనార్టీలకు నో ఛాన్స్, వీరమహిళకు ఒకటే సీటు.. జనసేన లిస్ట్ పై తీవ్ర విమర్శలు
18 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన పవన్ అన్ని సీట్లూ డబ్బున్నవారికే కేటాయించారని, అగ్రవర్ణాలకే సీట్లిచ్చారనే విమర్శలు వినపడుతున్నాయి. అది జనసేన కాదు, ధన సేన అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.
మూడు సీట్లు మినహా జనసేన ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. అయితే ఈ లిస్ట్ తో పవన్ కల్యాణ్ కేవలం మాటల మనిషి అని మరోసారి రుజువైంది. వలస నేతలకు సీట్లివ్వడమే కాదు, కనీసం తాను చెప్పిన సామాజిక న్యాయం కూడా పవన్ పాటించట్లేదని తేలిపోయింది. నీతులు చెప్పడానికే తాను ఉన్నానని, కానీ వాటిల్ని జనసేన పాటించదని నిరూపించారు పవన్.
మైనార్టీలకు గుండు సున్నా..
ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామన్నది కాదు, కనీసం ఆ పోటీ స్థానాల్లో అయినా సామాజిక న్యాయం పాటించామా లేదా అనేది మౌలిక సూత్రం. 21 స్థానాలకు గాను, 18 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన పవన్, అందులో ఒక్కటంటే ఒక్క సీటు కూడా మైనార్టీలకు ఇవ్వలేదు. పోనీ తాను ఘనంగా చెప్పుకునే వీర మహిళలకు అయినా న్యాయం చేశారా అంటే అదీ లేదు. కేవలం ఒకే ఒక్క సీటు మహిళలకు కేటాయించారు పవన్.
బీసీలకు తీరని అన్యాయం..
18 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన పవన్ అన్ని సీట్లూ డబ్బున్నవారికే కేటాయించారని, అగ్రవర్ణాలకే సీట్లిచ్చారనే విమర్శలు వినపడుతున్నాయి. అది జనసేన కాదు, ధన సేన అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. పవన్ ప్రకటించిన 18మంది అభ్యర్థుల్లో కేవలం ఇద్దరంటే ఇద్దరే బీసీలు. మొత్తం 18 సీట్లలో 12 అగ్రవర్ణాలకే కేటాయించారు పవన్. కులాలవారీ లెక్కలు తీస్తే.. శెట్టి బలిజ, గౌడ, తూర్పు కాపు, బీసీ వెలమ, యాదవ, బోయ, కురుబ ,చేనేత కులాలకు ఒక్క సీటు కూడా జనసేనలో దక్కలేదు. భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్లను పక్క పార్టీ నేతలకు పిలిచి మరీ ఇచ్చారు పవన్.
ఇక పవన్ సీటిస్తారని ఆశ పెట్టుకుని మోసపోయిన జనసేన నేతల లిస్ట్ చాంతాడంత ఉంది. అరకొర సీట్లకు టీడీపీతో ప్యాకేజీ మాట్లాడుకుని, అందులో కూడా పక్క పార్టీల వారికి వాటా ఇచ్చి, ఆఖరికి సొంత అన్నకు కూడా సీటు లేకుండా చేశారు పవన్. జనసేన లిస్ట్ బయటకొచ్చాక, పవన్ పై సొంత పార్టీలోనే వ్యతిరేకత తారాస్థాయికి చేరుకుంది.