పొత్తులపై పుకార్లు.. జనసైనికుల బేజారు
వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది, రెచ్చగొడుతోంది, మనవాళ్లెవరూ ఆందోళన చెందొద్దు అని పవన్ కల్యాణ్ తరపున ఆయన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పార్టీ శ్రేణులకు ఓ నోట్ పంపించారు.
ఏపీలో అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూస్తానన్నారు పవన్ కల్యాణ్. అంటే ప్రతిపక్షాలన్నీ కలసి పోటీ చేయాలనేది ఆయన ఉద్దేశం. పొత్తులతోనే అది సాధ్యం. అదే నిజమైతే జనసేనకు ఇచ్చే సీట్లెన్ని, వచ్చే సీట్లెన్ని..? ఈ విషయంలోనే టీడీపీ, జనసేన మధ్య ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొని ఉంది. టీడీపీ మరీ తీసికట్టుగా 10, 20 సీట్లు ఇస్తామంటే జనసేన పొత్తులకు ఒప్పుకుంటుందా అనేదే ప్రశ్నార్థకం. అంతకంటే ఎక్కువ ఇచ్చినా టీడీపీలో రెబల్స్ పుట్టుకొస్తారు, అది మొదటికే మోసం. అందుకే పొత్తులపై ఇప్పటి వరకూ ఉమ్మడి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో పుకార్లతో టెన్షన్ పడుతున్న జనసేన శ్రేణులకు పార్టీ తరపున ఒక నోట్ పంపారు. ఎన్నికల వ్యూహాలు, పొత్తులపై పార్టీ శ్రేణులు ఆందోళన పడొద్దని, అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి పవన్ కల్యాణ్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆ నోట్ లో తెలిపారు.
పుకార్లు నమ్మొద్దు..
గతంలో జనసేనకు టీడీపీ 20సీట్లు ఆఫర్ చేసిందని, పవన్ కల్యాణ్ నిర్ద్వందంగా తోసిపుచ్చారనే పుకారు షికారు చేసింది. దీనిపై స్వయంగా పవన్ కల్యాణే వివరణ ఇచ్చుకున్నారు. అలాంటి పుకార్లు నమ్మొద్దని, 20 సీట్లకు జనసేన ఎప్పుడూ ఒప్పుకోదని బహిరంగ వేదికపైనే చెప్పారు. అయితే ఈ విషయంలో వైసీపీ.. టీడీపీ, జనసేనను ఇరుకున పెట్టేలా సవాళ్లు విసురుతోంది. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించండి అంటూ రెచ్చగొడుతోంది. టీడీపీ, జనసేన మౌనంగానే ఉన్నాయి. కానీ జనసైనికులు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఆ సవాళ్లకు స్పందించకపోతే ఎలా అంటున్నారు. మన వాటా తేలాల్సిందేనంటున్నారు.
రొచ్చగొడుతున్నారు జాగ్రత్త..
వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది, రెచ్చగొడుతోంది, మనవాళ్లెవరూ ఆందోళన చెందొద్దు అని పవన్ కల్యాణ్ తరపున ఆయన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పార్టీ శ్రేణులకు ఓ నోట్ పంపించారు. రాష్ట్ర భవిష్యత్తు, పార్టీ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే పవన్ నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఈలోగా వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు. సోషల్ మీడియాలో గందరగోళం సృష్టిస్తున్నారని, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఈ విషయంలో భావోద్వేగాలకు లోను కావొద్దని సూచించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అనుసరించే వ్యూహాలను పార్టీ నాయకులకు పవన్ పారదర్శకంగా తెలియజేస్తారన్నారు.