మావయ్యకు నోట్లోంచి మాటలొస్తాయి, జేబులోంచి డబ్బులు రావు..

వరుసగా మూడో ఆదివారం జనవాణి కార్యక్రమం చేపట్టి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని ఇసుక దోపిడీపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు పవన్.

Advertisement
Update:2022-07-17 22:26 IST

దత్త పుత్రుడంటూ పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు పేలుస్తుంటే.. విద్యార్థులకు మావయ్య అంటూ ఇటీవల కాలంలో పదే పదే జగన్ ను వెటకారంగా సంబోధిస్తున్నారు పవన్ కల్యాణ్. తాజాగా మరోసారి ఆయన మావయ్య పేరుతో సెటైర్లు వేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈపాటికే చాలా పనులు చేసి ఉండేవారని అన్నారు పవన్. "తుందూరు ఆక్వా ఫ్యాక్టరీ గురించి ముద్దుల మావయ్య బాగా చెప్పారు. అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పారు. మావయ్యకు జేబులో నుంచి డబ్బులు తీయడం రాదు కానీ, నోట్లో నుంచి మాటలు మాత్రం బాగా వస్తాయి" అని పవన్‌ కల్యాణ్‌ వెటకరించారు.

సినిమా రిలీజ్‌లపై పెట్టిన శ్రద్ధ..

ఆమధ్య భీమ్లా నాయక్ సినిమా విడుదల సమయంలో రెవెన్యూ యంత్రాంగం ఎంత హడావిడి చేసిందో అందరికీ తెలిసిందే. థియేటర్ల వద్ద వీఆర్వోలు, ఎమ్మార్వోల ఫోన్ నెంబర్లు రాసి మరీ ఫిర్యాదులు తీసుకున్నారు. కానీ ఆ తర్వాత అంతా మామూలే. గతంలోనే దీనిపై విమర్శలు చేసిన పవన్ కల్యాణ్.. తాజాగా జనవాణిలో మరోసారి దెప్పిపొడిచారు. ఒక సినిమా రిలీజ్‌ అవుతుందంటే.. కలెక్టర్‌ నుంచి ఆర్డీవో వరకు అందరినీ రంగంలోకి దించుతారని, ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు మాత్రం ఆ వ్యవస్థలు పనిచేయవని ఎద్దేవా చేశారు. ప్రత్యర్థులపై దాడి చేయాలంటే కలెక్టర్‌, చీఫ్‌ సెక్రటరీ అందరూ ముందుకొస్తారని అన్నారు. 5, 10, 15 రూపాయల సినిమా టికెట్ల కోసం వ్యవస్థను మొత్తం నడపగలరు కానీ, సగటు మనిషి సమస్యల పరిష్కారానికి ఎందుకు బయటకు రావట్లేదని అధికారులను ప్రశ్నించారు.

151 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలా అద్భుతాలు చేసి ఉండొచ్చని అన్నారు పవన్ కల్యాణ్. అన్నొస్తే అద్భుతాలు జరగుతాయన్నారు కానీ, ఎక్కడా జరగడంలేదని చెప్పారు. మద్యపానం నిషేధం హామీ ఏమైందని ప్రశ్నించారు. వరుసగా మూడో ఆదివారం జనవాణి కార్యక్రమం చేపట్టి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని ఇసుక దోపిడీపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు పవన్. అవినీతిని ప్రశ్నించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని, గోపాలపురంలో 25మంది ఎస్సీ యువకులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టారని విమర్శించారు. నూతన ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో రాష్ట్రంలో విద్యావ్యవస్థను వైసీపీ దెబ్బతీసిందని విమర్శించారు. వైసీపీ పాలన అంతమవ్వాలంటే ప్రజల్లో మార్పు రావాలని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News