అప్పుడే చుట్టాలైపోయారా..? యువగళంలో జనసైనికులు
జనసైనికులు లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. టీడీపీ, యువగళం జెండాలతోపాటు ఎమ్మిగనూరులో జనసేన జెండాలు కూడా కనపడ్డాయి.
టీడీపీ, జనసేన పొత్తు ఇంకా ఖరారు కాలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం విడతలవారీగా బాగానే మాట్లాడుకుంటున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయనే టాక్ దాదాపుగా జనాల్లోకి వెళ్లిపోయింది. బీజేపీ కలసి వచ్చినా రాకపోయినా, చంద్రబాబుతోనే పవన్ పయనం అని అర్థమైపోయింది. జనసైనికులకు కూడా పిక్చర్ క్లారిటీ వచ్చేసింది. దీంతో వారు కూడా జనసేన జెండాలు పట్టుకుని యువగళం యాత్రలో కలసిపోయారు. మా మద్దతు మీకేనంటూ లోకేష్ వెనక తిరుగుతున్నారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరుగుతోంది. టీడీపీ, యువగళం జెండాలతోపాటు ఎమ్మిగనూరులో జనసేన జెండాలు కూడా కనపడ్డాయి. జనసైనికులు లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. బహిరంగ సభలో కూడా లోకేష్ జనసైనికులకు అభివాదం చేశారు.
భారతీ రెడ్డి ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు..?
ఎస్సీలను తాను అవమానించానంటూ సాక్షి మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని మండిపడ్డారు నారా లోకేష్. ఎస్సీలను అవమానించినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలగుతానన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే.. భారతీ రెడ్డి తన ఛానెల్, పత్రిక మూసేస్తారా? అని ప్రశ్నించారు. తాను ఎస్సీలను అవమానించినట్టు చూపించిన వీడియోలో ఎస్సీ నాయకులు, ప్రజలు చప్పట్లు కొడుతున్నారని, ఒకవేళ నిజంగానే వారిని అవమానిస్తే ఆ వర్గం వారు చప్పట్లు కొట్టి తన వ్యాఖ్యలను స్వాగతిస్తారా అని లాజిక్ తీశారు. భారతీరెడ్డి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారని ప్రశ్నించారు లోకేష్. టీడీపీ కార్యకర్తల జోలికొస్తే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు.