గెలిచే సీటు వదులుకోవడం త్యాగమా.. తణుకులో పవన్‌కు నిరసన సెగ
పొత్తుకు ముందు వారాహి యాత్రతో తణుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడ గత ఎన్నికల్లో టికెట్ కేటాయించలేకపోయిన విడివాడ రామచంద్రరావుకు ఈసారి న్యాయం చేస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం త్యాగం చేశానని.. పొత్తులో కావాలనే తగ్గానని పదే పదే చెప్పుకొంటున్నారు. అయితే పార్టీ గెలిచే సీట్లను కూడా టీడీపీకి, బీజేపీకి వదిలేయడాన్ని త్యాగమంటారా, చేతకానితనం అంటారా అని పార్టీ నేతలే నిలదీస్తున్నారు. పార్టీకి బాగా పట్టుందని భావిస్తున్న గోదావరి జిల్లాల్లోనూ అందునా గెలిచే సత్తా ఉందని జనసేన శ్రేణులు నమ్మకం పెట్టుకున్న సీట్లనూ టీడీపీకి వదిలేయడాన్ని ఆ పార్టీ తరఫున టికెట్ ఆశించిన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న ప్రజాగళం యాత్రకు చంద్రబాబుతో కలిసి తణుకు వచ్చిన పవన్ కళ్యాణ్‌కు ఇదే నిరసన ఎదురైంది.
హెలిప్యాడ్ దగ్గరే నిరసన
పొత్తుకు ముందు వారాహి యాత్రతో తణుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడ గత ఎన్నికల్లో టికెట్ కేటాయించలేకపోయిన విడివాడ రామచంద్రరావుకు ఈసారి న్యాయం చేస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు. దీంతో టికెట్ తనకే వస్తుందని విడివాడ ఆశలు పెట్టుకున్నారు. అయితే పొత్తులో భాగంగా తణుకు టిక్కెట్‌ను టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణకు కేటాయించారు చంద్రబాబు. గెలిచే టికెట్‌ను టీడీపీకి వదిలేయడం త్యాగమా అంటూ విడివాడ రామచంద్రరావు తణుకులో పవన్ కళ్యాణ్ దిగిన హెలిప్యాడ్ వద్దే నిరసన చేపట్టారు.
నీ మాటకు నువ్వే విలువ ఇచ్చుకోవా?
వారాహి యాత్రలో ప్రకటించిన మొదటి టిక్కెట్ టీడీపీకి కట్టబెట్టిన పవన్ కళ్యాణ్, వారాహి యాత్రలో నువ్వు ఇచ్చిన మాటకు విలువేది, గెలిచే స్థానం వదులుకోవడం త్యాగం అంటారా.. ప్లకార్డులతో విడివాడ వర్గీయులు నిరసన తెలిపారు. పోలీసులు కలగజేసుకుని, వారిని అక్కడి నుంచి పంపించి, పవన్‌కు దారి క్లియర్ చేశారు. అంతేకాదు ఆ తర్వాత ప్రజాగళం సభ వద్ద కూడా టీడీపీ, జనసేన శ్రేణులు బాహాబాహికి దిగడం కూటమిలో ఐక్యతకు నిదర్శనమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.