పోలీసులూ మీరు జాగ్రత్త.. పవన్ కల్యాణ్ హెచ్చరిక..

విజయవాడ పశ్చిమ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను వైసీపీ వర్గాలు అడ్డుకోవడం, వారి ఓటమి భయాన్ని తెలియజేస్తోందని అన్నారు పవన్ కల్యాణ్.

Advertisement
Update:2022-09-03 17:51 IST

"ఎమ్మెల్యేలు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. పోలీసులు మాత్రం సర్వీస్ లోనే ఉంటారు. ప్రభుత్వం మారితే మీరు తలదించుకునే పరిస్థితి వస్తుంది జాగ్రత్త.." అంటూ హెచ్చరించారు పవన్ కల్యాణ్. జగ్గయ్యపేటలో జెండా దిమ్మె వివాదంలో వైసీపీ వారిని అరెస్ట్ చేయాల్సింది పోయి బాధితులైన జనసేన నాయకులపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో పోలీసుల తీరు మారకపోతే తానే రోడ్డెక్కుతానని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదనే ఇన్నాళ్లూ సంయమనం పాటించానని, దాన్ని అలుసుగా తీసుకోవద్దని అన్నారు పవన్.

వైసీపీలో ఓటమి భయం..

విజయవాడ పశ్చిమ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను వైసీపీ వర్గాలు అడ్డుకోవడం, వారి ఓటమి భయాన్ని తెలియజేస్తోందని అన్నారు పవన్ కల్యాణ్. జనసేన చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని పోలీసులు అనుమతి లేదు అంటూ అడ్డుకుంటున్నారని, వైసీపీ చేస్తున్న కార్యక్రమాలన్నింటికీ అనుమతి ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ దిమ్మెలకు అనుమతి ఉందని పోలీసులు అధికారికంగా ప్రకటించగలరా, అనుమతి లేకపోతే వాటిని కూడా తొలగిస్తారా అని అడిగారు పవన్.

అది ఎవరి తరం కాదు..

జనసేన ఉనికి లేకుండా చేయాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని, ఆఖరుకు జెండా దిమ్మెలు లేకుండా చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు పవన్ కల్యాణ్. వైసీపీ ఉనికి తీసిపారేయడం ఎవరి తరం కాదన్నారు. ప్రజలే తమ పార్టీని కాపాడుకుంటారని చెప్పారు. అక్రమ కేసులకు గురైనవారికి జనసేన అండగా నిలబడుతుందని చెప్పారు పవన్. పోలీసులు అధికార పార్టీకి వంతపాడటాన్ని పక్కనపెట్టాలని, ధర్మాన్ని పాటించాలని అన్నారు పవన్ కల్యాణ్. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Tags:    
Advertisement

Similar News