కాపుల చివరి ఆశ కూడా ఆవిరేనా?
మళ్ళీ ఇంతకాలానికి జనసేన రూపంలో ఆశలు చిగురించినా వాటిని స్వయంగా పవనే తుంచేశారు. పవన్ మాటలు విన్న తర్వాత భవిష్యత్తులో కాపు సామాజికవర్గం నుండి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లాజికల్‌గా ఎవరికీ ఉండదని తెగ ఫీలైపోతున్నారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పిచ్చి లాజిక్కుతో కాపుల ఆశలు ఆవిరులైపోయాయి. చేగొండి హరిరామజోగయ్యకు అయితే దిమ్మతిరిగుంటుంది. పవన్ వినిపించిన లాజిక్కే విచిత్రంగా ఉంది. సీఎం పోస్టుపై పవన్ మాట్లాడుతూ.. జనసేన పార్టీకి టీడీపీ అయినా బీజేపీ అయినా అసలు ముఖ్యమంత్రి పదవి ఎందుకిస్తాయని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో 7 శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీకి ఎవరైనా సీఎం పోస్టు ఆఫర్ చేస్తారా అని అడిగారు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత జనసేన ఓటు బ్యాంకు సగటున 18 శాతం ఉందన్నారు.
పార్టీ ఓటు బ్యాంకు 7 శాతం అని చెప్పిందీ పవనే, ఓటు బ్యాంకు 18 శాతంకు పెరిగిందని చెప్పిందీ పవనే. పార్టీ ఓటు బ్యాంకు పెరగటమే నిజమైతే పెరిగిన ఓటు బ్యాంకును చూపించి సీట్లు, సీఎం పోస్టును బేరమాడుకుంటారు ఎవరైనా. కానీ పవన్ మాత్రం రివర్సులో మాట్లాడుతున్నారు. ఇక్కడే పవన్ లాజిక్కుతో అందరికీ షాక్ తగిలింది. ఇదంతా చూసిన తర్వాత కాపుల ఆశలు ఆవిరైపోయిన విషయం తెలుస్తోంది. జనసేన అంటే ఇష్టంలేని కాపు ప్రముఖులు కూడా టీడీపీ పొత్తులో పవన్ సీఎం అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని కోరుకున్నారు.
ఎందుకంటే ఏదో రూపంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగాను తర్వాత సీఎంగాను కాపు వ్యక్తి అవుతారు అని ఆశపడ్డారు. నిజంగానే టీడీపీ పొత్తులో పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్న కాపు ప్రముఖులు కూడా ఎన్నికల నాటికి జనసేనకు మద్దతుగా నిలిచే అవకాశాలున్నాయి. ఎందుకంటే చరిత్రలో రెండోసారి ఒక కాపుకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కుతోందని. గతంలో ప్రజారాజ్యం పార్టీకి కాపులు మద్దతిచ్చింది కూడా చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్న ఆశతోనే.
మళ్ళీ ఇంతకాలానికి జనసేన రూపంలో ఆశలు చిగురించినా వాటిని స్వయంగా పవనే తుంచేశారు. పవన్ మాటలు విన్న తర్వాత భవిష్యత్తులో కాపు సామాజికవర్గం నుండి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లాజికల్‌గా ఎవరికీ ఉండదని తెగ ఫీలైపోతున్నారు. కాపుల కన్నా జనాభాలో చాలా తక్కువగా ఉన్న బ్రాహ్మణ, వైశ్య, వెలమ, కమ్మ, రెడ్డి సామాజికవర్గం నేతలు ముఖ్యమంత్రలయ్యారు. పై సామాజికవర్గాల్లోని నేతలు ఫుల్ టైమ్ పొలిటిషీయన్లయితే పవన్ పార్ట్ టైమ్ పొలిటీషియన్. సీఎంలయిన వాళ్ళంతా తాము ముఖ్యమంత్రులవ్వాలని బలంగా కోరుకున్నారు. పవన్ మాత్రం చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారంతే తేడా.