పవన్‌ తీరుపై కేడర్‌లో పెదవి విరుపులు..!

పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టి పదేళ్లు దాటింది. పొత్తులతోనో, ఒంటరిగానో గడచిన రెండు ఎన్నికల నుంచి పోరాడుతున్నారు. పార్టీ కోసం ఆయనే తిరుగుతున్నారు.

Advertisement
Update:2023-10-25 07:41 IST

తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశాన్ని తానే స్వయంగా ప్రకటించి ప్రజల్లో పలుచనైన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఈ అంశంలో తన పార్టీ కేడర్‌ను కూడా నిరాశకు గురిచేశారు. ఆ తర్వాత కూడా ప్రతి కార్యక్రమంలోనూ జనసేన అధినేతలా కాకుండా.. తెలుగుదేశం పార్టీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ఆ పార్టీ కార్యకర్తలా ఆయన వ్యవహరిస్తున్న తీరును జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొనడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. టీడీపీతో చెలిమి కోసం అంతగా తహతహలాడటం ఎందుకన్న ప్రశ్న కేడర్‌ నుంచే వినిపిస్తోంది.

టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశానికి రెండు పార్టీలూ తమ సభ్యులను నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అయితే పవన్‌ కల్యాణ్‌ పనిగట్టుకుని రాజమండ్రికి వెళ్లి మరీ ఈ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనడం మాత్రం జనసేన కేడర్‌ కు రుచించడం లేదు. అంత అవసరం ఏముందని పార్టీ నేతల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టి పదేళ్లు దాటింది. పొత్తులతోనో, ఒంటరిగానో గడచిన రెండు ఎన్నికల నుంచి పోరాడుతున్నారు. పార్టీ కోసం ఆయనే తిరుగుతున్నారు. ఆయనది పార్టీలో వన్‌ మ్యాన్‌ షో. వేదిక మీద కూడా మూడు కుర్చీలే ఉంటాయి. ఒకటి నాదెండ్ల మనోహర్‌, రెండోది నాగబాబుకి.. అయినా సరే ఆయన ఫ్యాన్స్, కాపు సామాజికవర్గం మాత్రం పవన్‌ కల్యాణ్‌ని తమ కాబోయే ముఖ్యమంత్రిగానే భావిస్తున్నారు. తన స్థాయిని.. కనీసం ఆ విషయాన్ని పక్కన పెట్టిన పవన్‌ కల్యాణ్‌ లోకేష్‌ తో కలసి సమావేశంలో పాల్గొనడంపై పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. చంద్రబాబుతో భేటీ అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని, అయితే లోకేష్‌ నేతృత్వంలో జరుగుతున్న సమావేశానికి పిలవకున్నా పొలోమంటూ వెళ్లడాన్ని కొందరు తప్పు పడుతున్నారు. తన బలహీనతను తాను మరోసారి బయట పెట్టుకున్నారన్న కామెంట్స్‌ వినపడుతున్నాయి. ఏదైనా ఉంటే హైదరాబాద్‌లోనే ఉండి సమావేశాలకు వెళ్లే జనసేన నేతలకు దిశానిర్దేశం చేయవచ్చు. నాదెండ్ల మనోహర్‌ కు ఆదేశాలు జారీ చేయొచ్చు. అంతే తప్ప లోకేష్‌ పక్కన కూర్చుని తన స్థాయిని తగ్గించుకునే ప్రయత్నం చేశారని అభిమానులు మధనపడుతున్నారు.

చంద్రబాబుతో మున్ముందు ఎన్నికల పొత్తుల విషయం మాట్లాడే సమయంలో తగిన సీట్లు రాబట్టుకోవడానికి అవసరమైన బెట్టును.. ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు ద్వారా జార విడుచుకుంటున్నారని కూడా పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. సొంత పార్టీ నేతలపై నమ్మకం లేకనే పవన్‌ రాజమండ్రి వెళ్లినట్టు కనిపిస్తోందన్న కామెంట్స్‌ కూడా సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. మరి పవన్‌ చేసింది రైటా..? రాంగా..? అన్నది రానున్న కాలంలో తేలనుంది.

Tags:    
Advertisement

Similar News