చేసుకున్న బాబుకి చేసుకున్నంత..!

ఎన్టీ రామారావు దగ్గర్నించి, చంద్రబాబు దాకా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నది పవన్‌ కళ్యాణ్‌ ముఠానీ, పరువులేని బీజేపీ వాళ్లనీ ఎమ్మెల్యేలుగా గెలిపించడానికా..? ఎంపీలుగా వాళ్లని అందలాలు ఎక్కించడానికా..? అని బహిరంగంగానే అడుగుతున్నారు.

Advertisement
Update:2024-02-20 20:12 IST

మొన్నటిదాకా ఊపుమీదున్న చంద్రబాబుకి క్రమంగా ఉచ్చు బిగుస్తోంది. గొంతెత్తి మాట్లాడిన చంద్రబాబుకి గొంతులో ఇప్పుడు పచ్చి వెలక్కాయ పడినట్టే ఉంది. అటు చూస్తే జగన్మోహన్‌రెడ్డి వెనక జై అంటూ నడుస్తున్న జనశ్రేణి. ఇటు చూస్తే, మతోన్మాద బీజేపీకి అమ్ముడుపోతావా..? అని ఆగ్రహంతో ఊగిపోతున్న కమ్యూనిస్టులు! ఒక పక్క కాపుల్లో పెరుగుతున్న అనుమానం. బాబు కమ్మ రాజకీయాలపై అపనమ్మకం..! ఈ పక్క, పెద్దసంఖ్యలో ఉన్న ముస్లింలు, మా ఓట్లని బాబు బీజేపీకి తాకట్టుపెడతాడా..? అని బాగా హర్ట్‌ అయి ఉన్నారు.

తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్న దళితులూ చంద్రబాబు పిల్లి మొగ్గల్ని అసహ్యించుకుంటున్నారు. ఈ తలనెప్పులన్నీ చాలనట్టు, టీడీపీలో అసంతృప్తి కెరటాలు కెరటాలుగా ఎగసిపడుతోంది. బీజేపీ వాళ్లకీ, జనసేన వాళ్లకీ ఉదారంగా సీట్లు గనక ఇచ్చేస్తే ఇంతకాలం తెలుగుదేశాన్నే నమ్ముకున్న వాళ్లం ఏ యేట్లో దూకాలి..? అని ప్రాంతీయ నాయకులు రగిలిపోతున్నారు. ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో 60 నుంచి 70 దాకా జనసేన, బీజేపీ వాళ్లకి ఇచ్చేస్తే ఆయా నియోజకవర్గాల్లోని బలమైన టీడీపీ నాయకులకు ఏది దిక్కు..? త్యాగాలు చేయాలా..? దేనికోసం..! ఎవర్ని ఉద్ధరించడానికి..? ఎన్టీ రామారావు దగ్గర్నించి, చంద్రబాబు దాకా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నది పవన్‌ కళ్యాణ్‌ ముఠానీ, పరువులేని బీజేపీ వాళ్లనీ ఎమ్మెల్యేలుగా గెలిపించడానికా..? ఎంపీలుగా వాళ్లని అందలాలు ఎక్కించడానికా..? అని బహిరంగంగానే అడుగుతున్నారు. చంద్రబాబు మెడకి చుట్టుకున్న అసలు సిసలు సమస్య ఇది..!

‘‘30 సీట్లు ఇచ్చినా, అధికారంలో భాగస్వాములం అవుతాం’’ అని పవన్‌ కళ్యాణ్‌ కాపులకు నచ్చజెపుతున్నారు. అనగా చంద్రబాబుని సీఎంని చేసి అతని పల్లకీ మోయమనేగా మీరంటున్నది అని కాపు ఉద్యమకారులు కత్తులు దూస్తున్నారు.

ఇది పొసగని పొత్తు, అతకని కసరత్తు. కమ్మ టీడీపీకీ, కాపు జనసేనకీ మౌలికంగా పడదు. ముస్లిం, దళిత అనుకూల తెలుగుదేశం పార్టీకీ, గుడులూ గోపురాలూ కట్టుకుందాం అంటున్న బీజేపీకీ అసలు పొసగదు. ఒక ఒరలో రెండు కత్తులే ఇమడవు అంటే, మహాశక్తి బీజేపీ మరో కత్తిగా చంద్రబాబు మెడ మీదకి దూసుకొచ్చింది. ఎంత విచిత్రం..!

ఒకనాడు చక్రం తిప్పిన చంద్రబాబు, అమిత్‌ షా, పవన్‌ కళ్యాణ్‌ కాళ్లను కలిపి పట్టుకుంటున్న దయనీయమైన దృశ్యం కడురమణీయమై భాసిల్లుతున్నది..! వేల కోట్ల వ్యాపారాలూ, ఆస్తులతో తులతూగుతున్న, బంగారు ఊయల ఊగుతున్న చంద్రబాబు నాయుడనే నాయకుడికి పట్టిన దుర్గతి, వైసీపీ శ్రేణులకు కనువిందు చేస్తున్నది.

మంగళవారం నాడు, విజయవాడలో సీసీఐ, సీపీఎం పెద్దనాయకులు మాకినేని బసవపున్నయ్య భవన్‌లో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కి పరమద్రోహం చేసిన బీజేపీతో చంద్రబాబు ఎలా మీలాఖత్‌ అవుతాడని ప్రశ్నించారు. చంద్రబాబు తమ సొంత కులంవాడని కమ్మ కమ్యూనిస్టులు లోలోన మురిసిపోతున్నా, బీజేపీతో సైద్ధాంతిక యుద్ధం చేయక తప్పదు గనక, బాబుని విమర్శించడం మొదలుపెట్టారు. వాస్తవానికి చంద్రబాబు చేసిన పని కమ్యూనిస్టులకు చావు దెబ్బ. బాబు తప్పితే మరో దిక్కులేని కమ్యూనిస్టులు, ఆ ఒక్క ఆధారం చేజారిపోయేసరికి, అనాథలుగా మిగిలిపోయారు. ఒకటిరెండు సీట్లన్నా వచ్చేదారి మూసుకుపోయింది.

తెలుస్తోందా..? అక్కడ బీజేపీ గేమ్‌ ఫలిస్తోంది..! పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు లాంటి పొలిటికల్‌ జోకర్లతో ఆడుకుంటోంది బీజేపీ. ‘‘ఆట ఆగిందా.. నీ సీటు గోవిందా’’ అని పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో బెదిరిస్తోంది బీజేపీ నాయకత్వం.

పగవాడిక్కూడా వద్దురా బాబూ, చంద్రబాబు కష్టాలు. ఇవేవీ చాలవన్నట్టు... రాప్తాడు సభ చూశారా..? అంటూ రెచ్చిపోతున్నాడు జగన్‌. భీమిలి సభ హిట్టు, దెందులూరు సభ సూపర్‌ హిట్టు అయితే, 250 ఎకరాల్లో, పది లక్షల మంది జనంతో కిటకిటలాడిన రాప్తాడు మహా బహిరంగ సభ బ్లాక్‌ బస్టర్‌..! ఆ సభనీ, ఆ కోలాహలాన్నీ చూసి, జై జగన్‌ అంటూ ఆకాశానికంటిన నినాదాలని వింటే... చంద్రబాబు అండ్‌ కంపెనీకి కంటికి నిదురవచ్చునే..! అన్నము సయించునే..! ఓటమి భూతము వెన్నాడే పీడకల నుంచి విముక్తి లభించునే..!

చరిత్రాత్మక రాప్తాడు సభ చంద్రబాబుకి రాజకీయ సమాధిగా, లోకేష్‌కి అంధకార బంధురమైన నిశిరాతిరిగా మిగిలిపోతోంది. వాళ్లిద్దరూ విశ్రాంతి కోసం ఫ్యాన్‌ స్విచ్‌ నొక్కక తప్పదేమో..!

Tags:    
Advertisement

Similar News