జగన్ షేక్ హ్యాండ్ ప్రయత్నం ఫెయిలైందా?
రాబోయే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వవద్దని వీళ్ళంతా జగన్‌తో ఇప్పటికే చెప్పారు. రోజాకు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని కూడా చెప్పేశారు.
నగిరి నియోజకవర్గం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఫెయిలయ్యారా? అవుననే సమాధానం వినిపిస్తోంది పార్టీ వర్గాల నుండి. ఇంతకీ విషయం ఏమిటంటే విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా జగన్ నగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగసభ కూడా జరిగింది. ఇదే సమయంలో కొన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి రోజాను ఈడిగ కార్పొరేషన్ ఛైరపర్సన్ కేజే శాంతిని ఒకటి చేయాలని జగన్ అనుకున్నారు.
తనకు చెరో వైపున నిలబడిన రోజా, శాంతి చేతలను జగన్ తన చేతిలోకి తీసుకుని కలుపుదామని ప్రయత్నించారు. అయితే శాంతి వెంటనే తన చేయిని వెనక్కు తీసేసుకున్నారు. రోజాతో షేక్ హ్యాండ్ ఇవ్వటానికి శాంతి ఏమాత్రం ఇష్టపడలేదు. జగన్ ఎంత ప్రయత్నించినా ఇద్దరితో షేక్ హ్యాండ్ ఇప్పించలేకపోయారు. ఈ విషయాలన్నీ వీడియోల్లో స్పష్టంగా కనబడుతున్నది. కేజే శాంతి, కేజే కుమార్ దంపతులకు రోజాకు చాలా కాలంగా పడటంలేదు.
నిజానికి ఒకపుడు వీళ్ళే రోజాకు నగిరిలో కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవాళ్ళు. అలాంటి వీళ్ళు రోజాకు తర్వాత బద్ధవిరోధులుగా తయారయ్యారు. రోజా అంటే పడని శ్రీశైలం ట్రస్టు బోర్డు ఛైర్మన్ చక్రపాణిరెడ్డి లాంటి వాళ్ళు మరికొందరు కూడా వీళ్ళకు తోడయ్యారు. రాబోయే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వవద్దని వీళ్ళంతా జగన్‌తో ఇప్పటికే చెప్పారు. రోజాకు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని కూడా చెప్పేశారు.
వీళ్ళు గనుక రోజాకు సహకరించకపోతే గెలుపు కష్టమనే అనుకోవాలి. ఆ మధ్య గన్నవరంలో వల్లభనేని వంశీ-యార్లగడ్డ వెంకటరావును కలుపుదామని జగన్ చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. చివరకు యార్లగడ్డ పార్టీని వదిలేశారు. ఈ మధ్యనే నెల్లూరు పర్యటనలో మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్‌తో ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ తో షేక్ హ్యాండ్ ఇప్పించాలని ప్రయత్నిస్తే అదీ ఫెయిలైంది. వీళ్ళిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు కానీ తర్వాత నుండి ఎవరి గోల వాళ్ళదే. మరి జగన్ షేక్ హ్యాండ్ ప్రయత్నాలు అన్నీ ఫెయిలవుతునే ఉన్నాయి.
♦