ఈరోజే జగనన్నకు చెప్పేద్దాం.. హిట్టా..? ఫట్టా..?
Jaganannaku Chebudam: నేరుగా సీఎం తమ సమస్యలు వింటారు, వాటిని పరిష్కరిస్తారు, వాటిపై దృష్టిపెడతారు అనే ఆలోచన జనంలో ఉంది. 1902 అనే నెంబర్ సర్వ సమస్యల పరిష్కార మార్గం అనుకుంటున్నారు.
Jaganannaku Chebudam | ఓవైపు సంక్షేమ పథకాల అమలు, మరోవైపు తమ పనితీరు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం... ఇవి రెండూ నిరంతర ప్రక్రియలుగా కొనసాగిస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఇటీవల ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వంతో ఈ అంచనా ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు అంటూ మరోసారి జనంలోకి వెళ్లారు నాయకులు. ఇప్పుడు నేరుగా జగనే రంగంలోకి దిగుతున్నారు. నేరుగా అంటే ఆయన జనంలోకి రారు, ఆనయకు జనం ఫోన్ చేస్తారు. ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యల విషయంలో నేరుగా సీఎంకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసే కార్యక్రమం ఇదనమాట.
నేటినుంచే జగనన్నకు చెబుదాం..
జగనన్నకు చెబుదాం.. అనే కొత్త కార్యక్రమాన్ని ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు దీనిని చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు టోల్‌ఫ్రీ నెంబరు 1902ను ఏర్పాటు చేసింది. ఆ నెంబరుకు ఫోను చేసి సమస్యలు తెలియజేస్తే వాటిని నమోదు చేసుకొని పరిష్కరిస్తారు. అవి ఏమేరకు పరిష్కారమయ్యాయనే విషయాన్ని ఎప్పటికప్పుడు మెసేజ్ ల రూపంలో బాధితులకు తెలియజేస్తారు.
రెవెన్యూ సమస్యలు, భూ సమస్యలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమస్యలు.. ఏవయినా వాటిపై నేరుగా సీఎం జగన్ కి ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పటి వరకూ స్పందన అనే కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ స్థాయిల్లో అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. వాటిలో పరిష్కారం కాని సమస్యలకు కూడా మెగా స్పందన అని చెప్పుకుంటున్న ఈ కార్యక్రమం ఓ దారి చూపిస్తుందని నమ్ముతున్నారు.
తొలిరోజే దీనిపై ఓ అభిప్రాయానికి రాలేం. కానీ నేరుగా సీఎం తమ సమస్యలు వింటారు, వాటిని పరిష్కరిస్తారు, వాటిపై దృష్టిపెడతారు అనే ఆలోచన జనంలో ఉంది. 1902 అనే నెంబర్ సర్వ సమస్యల పరిష్కార మార్గం అనుకుంటున్నారు. కానీ దీనివల్ల ప్రయోజనం లేదు అని తెలిస్తే మాత్రం ప్రజలు నిరాశ చెందుతారు. ప్రతి రోజూ ఎన్ని సమస్యలపై కాల్స్ వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించాం. ప్రజల సంతృప్తి శాతం ఎంత అనే లెక్కలు విడుదలవుతాయి. ఈ లెక్కలతో హడావిడి చేయాలనుకుంటోంది వైసీపీ. ఎన్నికల ఏడాదిలో ఈ ప్రయోగం సక్సెస్ అయితే వైసీపీకి లాభమే. తేడా కొడితే మాత్రం లేనిపోని తలనొప్పిని కొని తెచ్చుకున్నట్టవుతుంది.