1902.. పరుగులు పెడుతున్న అధికారులు

చిన్న చిన్న నమస్యల్ని కూడా 1902కి కాల్ చేసి చెప్పేస్తున్నారు గ్రామస్తులు. దీంతో ఆ సమస్య రికార్డ్ అవుతోంది, పరిష్కారం ఎప్పుడనే ప్రశ్న మొదలవుతోంది.

Advertisement
Update:2023-05-18 08:11 IST

ఏపీలో ప్రభుత్వ అధికారులు, సిబ్బందిలో హడావిడి మొదలైంది. ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలన్నీ నేరుగా సీఎం జగన్ డ్యాష్ బోర్డ్ కి వెళ్తున్నాయి. గ్రామాల్లో సమస్యలుంటే నేరుగా 1902కి కాల్ చేసి చెప్పేస్తున్నారు బాధితులు. ఇన్నాళ్లూ స్పందన కార్యక్రమాల్లో అర్జీలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరిగినవారంతా నేరుగా జగనన్నకే చెప్పేస్తూ అధికారులనే తమ చుట్టూ తిప్పించుకునేలా చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు.

'జగనన్నకు చెబుదాం' సూపర్ హిట్ అని వైసీపీ అనుకూల మీడియా ప్రకటించుకుంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. గ్రామాల్లో వాస్తవ పరిస్థితి కూడా ఇదే అని చెప్పుకోవాలి. చిన్న చిన్న నమస్యల్ని కూడా 1902కి కాల్ చేసి చెప్పేస్తున్నారు గ్రామస్తులు. దీంతో ఆ సమస్య రికార్డ్ అవుతోంది, పరిష్కారం ఎప్పుడనే ప్రశ్న మొదలవుతోంది. కచ్చితంగా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై పడుతోంది. దీంతో అధికారులు, సిబ్బంది హడావిడి పడుతున్నారు.

దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నట్టు తేలిపోయింది. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. వాటికోసం ప్రభుత్వ సిబ్బంది మళ్లీ గ్రామాల్లోకి వస్తున్నారు, ఫిర్యాదుదారుల్ని కలసి మరోసారి సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఈ హడావిడి ఎన్నిరోజులు నిలకడగా ఉంటుందనేది చెప్పలేం. ప్రతి కంప్లయింట్ కి అండార్స్ మెంట్ సిద్ధం చేయాలి, ఆన్ లైన్ లో వాటి స్టేటస్ అప్డేట్ చేయాలంటే సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఓవైపు రోజువారీ విధులు, మరోవైపు సమస్యల పరిష్కారంకోసం చేపట్టే ప్రణాళిక.. రెండు విధాలుగా వారిపై ఒత్తిడి మొదలవుతుంది. ప్రస్తుతానికి మాత్రం 1902 విజయవంతం అయిందని క్షేత్ర స్థాయి సమాచారం. 

Tags:    
Advertisement

Similar News