అప్పట్లో జగన్ కూడా ఇలా ఆలోచించి ఉంటే..?
రోడ్లపై గుంతల పాపం గత ప్రభుత్వానిదేనంటూ నిందలు వేసినా మరమ్మతుల విషయంలో సీఎం చంద్రబాబు ఆలస్యం చేయాలనుకోకపోవడం విశేషం. దీంతో రూ.300 కోట్లతో రోడ్ల సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించినట్టయింది.
ఏపీలో రోడ్ల పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉందని, తక్షణమే రిపేర్లు అవసరమైన రోడ్లు మరో 2,936 కిలోమీటర్ల మేర ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గుంతలు పూడ్చేందుకు తక్షణం రూ.300కోట్లు అవసరం అని పేర్కొన్నారు. సీఎం సానుకూలంగా స్పందించారని, తక్షణం పనులు చేపట్టాలని ఆదేశించారని, అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలవాలని కూడా చెప్పారని ప్రభుత్వం తెలిపింది.
గత ప్రభుత్వానికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. అప్పట్లో సీఎం జగన్ ముందు కూడా ఇలాంటి ప్రతిపాదనే వచ్చింది. ఆయన సంక్షేమ పథకాల అమలుకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు కానీ రోడ్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదనే అపవాదు ఉంది. గుంతల రోడ్లపై వచ్చిన విమర్శలను వైసీపీ నేతలు బలంగానే తిప్పికొట్టారు. 2014నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ హయాంలో వేసిన రోడ్లు అప్పుడే పాడైపోయాయని, అది గత ప్రభుత్వ తప్పిదమేనని అన్నారు నేతలు. ఆ ప్రభుత్వం తప్పుచేసినందుకే 2019లో ప్రజలు వైసీపీకి ఓటు వేశారు, కనీసం అందుకైనా రోడ్ల గురించి ఆలోచించొచ్చు కదా. గుంతల రోడ్లపై వెళ్లే జనం గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటారని వైసీపీ నేతలు అనుకున్నారు, కానీ ఆ తప్పు వైసీపీ ఖాతాలోనే పడింది. ఫలితం 2024లో కనపడింది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రోడ్లు అద్దాల్లో మెరిసిపోతాయనే అంచనాలు ఎవరీకీ లేవు. అసలే రాష్ట్రానికి అప్పుల భారం అంటున్నారు, ఆపై సూపర్ సిక్స్ హామీలు గుదిబండలా మారే ప్రమాదం ఉంది. అయితే సీఎం చంద్రబాబు కాస్త తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వెంటనే రోడ్ల మరమ్మతులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై గుంతల పాపం గత ప్రభుత్వానిదేనంటూ నిందలు వేసినా మరమ్మతుల విషయంలో ఆలస్యం చేయాలనుకోకపోవడం విశేషం. రూ.300 కోట్లతో రోడ్ల సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించినట్టయింది. గతంలో జగన్ కూడా ఇలాగే ఆలోచించి ఉంటే రోడ్లపై గుంతల విషయంలో వైసీపీ అన్ని విమర్శలు ఎదుర్కొనేది కాదు.