రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్..
రషీద్ కుటుంబాన్ని జగన్ ఫోన్ లో పరామర్శించారని, నేరుగా పరామర్శించేందుకు ఆయన వస్తున్నారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.
వినుకొండ హత్యపై వైసీపీ సీరియస్ గా స్పందిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు, వారికి ధైర్యం చెప్పారు. మరికొందరు నేతలు మీడియా ముందుకొచ్చి ఈ దారుణ ఘటనను ఖండించారు. టీడీపీ దాడుల సంస్కృతి ఇకనైనా మారాలని హెచ్చరించారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా వినుకొండ ఘటనపై వెంటనే స్పందించారు. ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన హుటాహుటిన రాష్ట్రానికి బయలుదేరారు.
అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలను సీఎం చంద్రబాబు విడనాడాలని హెచ్చరించారు జగన్. సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. ఏపీలో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన వరుస హింసాత్మక ఘటనలపై ప్రత్యేక ఏజెన్సీతో విచారణ చేపట్టాలన్నారు జగన్. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేసిన ఆయన రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరారు.
వినుకొండలో గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, తొలిసారి వినుకొండ చరిత్రలో నడిరోడ్డుపై మర్డర్ జరిగిందని అన్నారు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. కూటమి అధికారంలోకి వచ్చాక రాజకీయ దాడులు పెరిగిపోయాయని చెప్పారు. రషీద్ వైసీపీకోసం పనిచేశాడని, తనతో కూడా సత్సంబంధాలున్నాయని, చివరికిలా రాజకీయ ప్రతీకారాలకు బలైపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. రషీద్ కుటుంబాన్ని జగన్ ఫోన్ లో పరామర్శించారని, నేరుగా పరామర్శించేందుకు ఆయన వస్తున్నారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.