మెడలు వంచాం.. విజయం సాధించాం

చంద్రబాబులో భయం మొదలైందనడానికి ఇదే సంకేతమని చెప్పారు జగన్. టీడీపీ మెడలు వంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు.

Advertisement
Update:2024-08-14 13:24 IST

విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకుండా వెనకడుగు వేసిందని అన్నారు మాజీ సీఎం జగన్. సీఎం చంద్రబాబులో భయం మొదలైందనడానికి ఇదే సంకేతమని చెప్పారు. టీడీపీ మెడలు వంచి విజయం సాధించామన్నారు. వైసీపీ కేడర్ బలంగా కనపడటంతో టీడీపీ పోటీనుంచి విరమించుకుందని చెప్పారు. యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో సమావేశమైన జగన్.. బొత్స విజయం ఖాయం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు.


మన వ్యక్తిత్వమే మనకు శ్రీరామరక్ష అని చెప్పారు జగన్. చంద్రబాబు ప్రలోభాలు పెట్టినా తమ నాయకులు ఎవరూ లొంగలేదన్నారు. నిబ్బరంతో నిలబడటం వల్లే ఈ విజయం దక్కిందని చెప్పారు. పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఒక్కటిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు వెనక్కితగ్గారన్నారు. వాస్తవానికి చంద్రబాబు సహజ నైజం ఇది కాదని, ఆయన ఫోన్లు చేసి… అది ఇస్తా, ఇది ఇస్తా అనేవారని.. ఎన్నికల సమయంలోకూడా ప్రజల్ని ఇలాగే మభ్యపెట్టారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరికీ కాల్స్‌ చేసి.. అది ఇస్తా, ఇది ఇస్తా అని చంద్రబాబు ఆశ చూపెట్టే ఉంటారని, కానీ చివరకు ధర్మం, న్యాయం గెలిచిందని చెప్పారు జగన్.

ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని అన్నారు జగన్. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయని, వాటికి వడ్డీలు కూడా మిగిలే ఉన్నాయని గుర్తు చేశారు. అవన్నీ సరిచేసుకున్నామని, కొవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్ని కూడా ఎదుర్కొని నిలబడ్డామని, ఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు కూడా తాము ఎలాంటి సాకులు చెప్పలేదన్నారు జగన్. శ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చేయలేదన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా.. క్యాలెండర్‌ ప్రకటించి పథకాలు అమలు చేశామని చెప్పారు. ఐదేళ్లపాటు క్యాలెండర్‌ తప్పకుండా పథకాలను ప్రతి ఇంటికీ డోర్‌ డెలివరీ చేశామన్నారు. కానీ రెండున్నర నెలలోనే కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని విమర్శించారు జగన్. జగనే ఉండి ఉంటే అన్ని పథకాలు సక్రమంగా అమలయ్యేవనిప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News