నేను ఊహించని ఫలితాలివి -జగన్

ఏం చేసినా, ఎంత చేసినా తమకున్న 40 శాతం ఓటు బ్యాంకుని వైరి వర్గాలు తగ్గించలేకపోయాయని అన్నారు జగన్. కచ్చితంగా ఇక్కడినుంచి పైకి లేస్తామని, గుండె ధైర్యంతో నిలబడతామని చెప్పారు.

Advertisement
Update:2024-06-04 20:14 IST

ఏపీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈ ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని, ఇవి ఊహించని ఫలితాలని చెప్పారాయన. కోట్లాదిమంది ప్రజలకు సంక్షేమం అందించామని, గతంలో ఎప్పుడూ జరగనంత మంచి చేశామని, అన్ని వర్గాలకూ మేలు చేశామని, ఫలితాలు ఇలావస్తాయని అనుకోలేదన్నారు. 53 లక్షల మంది తల్లులకు, వారి పిల్లలకు మంచి చేశానని, వారి పిల్లల భవిష్యత్ కోసం తాపత్రయపడ్డానని, ఆ అక్కచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు జగన్. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల విషయంలో మంచి చేసినా, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ ఇంటి వద్దకే పెన్షన్ పంపించినా ఫలితం లేదన్నారు. అవ్వాతాతలు చూపించిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదన్నారు జగన్. 54 లక్షల మంది రైతులకు మంచి చేశామని, 1.5 కోట్ల మందికి సంక్షేమ ఫలాలు అందాయని, అందరికీ మంచి జరగాలని ఆరాటపడ్డామని వివరించారు. ఫలితాలపై జగన్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.


వైసీపీ హయాంలో తాను చేసిన మంచిని మరోసారి ప్రజలకు వివరించారు జగన్. ఓడిపోయినా కూడా వైసీపీ ఎప్పుడూ పేదవాడికి అండగా ఉంటుందని చెప్పారాయన. ఎప్పుడూ పేదవారికోసమే గళం విప్పుతామని అన్నారు. ఇప్పుడు గెలిచింది పెద్ద పెద్దవాళ్ల కూటమి అని అన్నారు. కూటమిలో ఉన్న బీజేపీ నేతలకు, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కి అభినందనలు తెలిపారు. ఓడిపోయినా కూడా తన ప్రతి కష్టంలో తోడుగా, అండగా నిలబడిన వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి వాలంటీర్ కు, స్టార్ క్యాంపెయినర్లకు కృతజ్ఞతలు తెలిపారు జగన్.

ఏం చేసినా, ఎంత చేసినా తమకున్న 40 శాతం ఓటు బ్యాంకుని వైరి వర్గాలు తగ్గించలేకపోయాయని అన్నారు జగన్. కచ్చితంగా ఇక్కడినుంచి పైకి లేస్తామని, గుండె ధైర్యంతో నిలబడతామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండటం, పోరాటాలు చేయడం తమకు కొత్త కాదన్నారు జగన్. ఈ ఐదేళ్లు తప్ప తన రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలోనే గడిపానన్నారు. పోరాటాలు చేశానని, రాజకీయాల్లో ఎవరూ చూడని కష్టాలు అనుభవించానని, అంతకంటే తనను కష్టపెట్టినా సిద్ధంగా ఉన్నానని, ఎదుర్కొంటానని అన్నారు జగన్. 

Tags:    
Advertisement

Similar News