నాకు ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ పెంచండి -జగన్
జూన్ 3వ తేదీ నాటికి తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని తన పిటిషన్ లో కోరారు జగన్. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని కోర్టుకి తెలిపారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం తనను అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. తన భద్రత తగ్గించారని, ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, తనకు ప్రాణహాని ఉన్న అంశాన్ని కూడా పరిశీలించలేదని అన్నారు. గతంలో కేంద్రం తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించిందని పేర్కొన్నారు. తన భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఆయన తరపున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3వ తేదీ నాటికి తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని తన పిటిషన్ లో కోరారు జగన్. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని కోర్టుకి తెలిపారు.
ఇటీవల వినుకొండ పర్యటనలో కూడా జగన్ కాన్వాయ్ లో డొక్కు వాహనం సంచలనంగా మారింది. గతంలో చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఆయన వాడిన వాహనాన్ని ఇప్పుడు జగన్ కి కేటాయించడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అలాంటి వాహనం ఇచ్చి, జగన్ కి హాని తలపెట్టేలా చూస్తున్నారని మండిపడ్డారు. అంతే కాదు, జగన్ సెక్యూరిటీని తగ్గించడంపై కూడా వైసీపీ నేతలు ఇదివరకే ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఇప్పుడు నేరుగా జగన్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. గతంలో జగన్ పై కూడా ఇవే ఆరోపణలు వచ్చాయి. 2019లో చంద్రబాబు అధికారం కోల్పోయాక ఆయన భద్రతను అప్పటి జగన్ ప్రభుత్వం కుదించింది. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. చంద్రబాబు కూడా అప్పట్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత 2022లో కుప్పంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో చంద్రబాబుకి సెక్యూరిటీ పెంచారు.
ప్రతిపక్ష నేత హోదాకోసం జగన్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇప్పుడు సెక్యూరిటీ కోసం ఆయన మరో పిటిషన్ దాఖలు చేయడం విశేషం. వాస్తవానికి ప్రతిపక్ష నేత హోదా వస్తే ఆటోమేటిక్ గా సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. ఆ విషయంలో ఎలాంటి ముందడుగు పడకపోవడంతో తన సెక్యూరిటీ పెంచాలని, తనకు ప్రాణహాని ఉందని జగన్ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు.