జగన్ మరో యాత్రకు రెడీ అవుతున్నారా?

తొందరలోనే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రజాయాత్ర-రచ్చబండ కార్యక్రమాన్ని జగన్ మొదలుపెట్టబోతున్నారు. ఈ ప్రోగ్రాంలో ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు బసచేసేలా ప్లాన్ చేస్తున్నారట.

Advertisement
Update:2023-09-08 10:41 IST

విదేశీ పర్యటన నుండి తిరిగిరాగానే జగన్మోహన్ రెడ్డి మరో యాత్రకు రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పెరిగిపోయింది. ఒకవైపు వారాహియాత్ర పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలను చుట్టేశారు. నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. మధ్యమధ్యలో చంద్రబాబునాయుడు కూడా ఏదో పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వీళ్ళ ముగ్గురి టార్గెట్ జగన్ మాత్రమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

జగన్ కూడా జిల్లాల పర్యటన చేస్తున్నారు. అయితే అదంతా సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఏదో పథకం నిధులను విడుదల చేసే పేరుతో మాత్రమే చేస్తున్నారు. కానీ అలా కాకుండా అచ్చంగా రాజకీయంగా యాత్రలు చేస్తేనే పార్టీ నేతలు, కార్యకర్తల్లో చురుకుపుడుతుందని ఆలోచించారట. అందుకనే ఈ నెలాఖరులో ప్రజాయాత్ర పేరుతో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. నిజానికి రచ్చబండ అనేది దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ఆర్‌ కార్యక్రమం. చిత్తూరులో ప్రోగ్రాంకు వెళుతున్న‌ప్పుడు ఆయ‌న ప్ర‌యాణిస్తున్న‌ హెలికాప్టర్ ప్ర‌మాదానికి గురైంది.

అప్పటి నుండి ఆ కార్యక్రమం అలాగే పెండింగ్‌లో ఉండిపోయింది. తొందరలోనే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అదే ప్రోగ్రాంను ప్రజాయాత్ర-రచ్చబండ పేరుతో జగన్ మొదలుపెట్టబోతున్నారు. ఈ ప్రోగ్రాంలో ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు బసచేసేలా జగన్ ప్లాన్ చేస్తున్నారట. కార్యక్రమం సక్రమంగా సాగేందుకు వీలుగా ప్రత్యేకమైన కమిటీని కూడా నియమించారట.

మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కమిటీ రచ్చబండ కార్యక్రమానికి అవసరమైన రూపురేఖలపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు బస చేయటంలో ఉద్దేశం ఏమిటంటే స్థానికులతో మాట్లాడటం, మంచి చెడ్డా తెలుసుకోవటమే. అలాగే పార్టీ నేతలు, క్యాడర్లోని అసంతృప్తిని గుర్తించి చల్లార్చటం. ఉదయం నుండి సాయంత్రం వరకు పబ్లిక్‌తో మమేకం అయి రాత్రిపూట పార్టీ నేతలతో సమీక్షలుపెట్టుకోవాలని జగన్ అనుకున్నారట. ఇందుకు వీలుగానే ప్రత్యేక కమిటీ కార్యాచరణ రెడీ చేస్తోంది. మొత్తానికి సెప్టెంబర్ చివరి నుండి జగన్ కూడా పూర్తిగా రంగంలోకి దిగేయబోతున్నారని అర్థ‌మవుతోంది.


Tags:    
Advertisement

Similar News