మోదీతో 50నిమిషాల సేపు జగన్ భేటీ.. ఏం మాట్లాడారంటే..?

గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా రుణాలు తీసుకుందని, వాటిని సర్దుబాటు చేసే క్రమంలో తాము కష్టపడుతున్నామని అయితే కేంద్ర ఆర్థికశాఖ రుణాలపై పరిమితి విధిస్తోందని ప్రధానికి విన్నవించారు జగన్.

Advertisement
Update:2022-12-28 16:16 IST

ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. దాదాపు 50నిమిషాల సేపు వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రధానికి బహూకరించారు జగన్. ప్రధాని తర్వాత ఆయన వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాత్రికి హోం మంత్రి అమిత్ షా భేటీతో జగన్ హస్తిన పర్యటన ముగుస్తుంది.

విన్నపాలు వినవలె..

విభజన హామీల అమలు విషయాన్ని గతంలో పలుమార్లు కేంద్రానికి గుర్తు చేసిన జగన్, ఇప్పుడు మరోసారి అదే పల్లవి కొత్తగా అందుకున్నారు. అందులో ముఖ్యమైనవి పోలవరం, కొత్త రుణాలు. గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా రుణాలు తీసుకుందని, వాటిని సర్దుబాటు చేసే క్రమంలో తాము కష్టపడుతున్నామని అయితే కేంద్ర ఆర్థికశాఖ రుణాలపై పరిమితి విధిస్తోందని ప్రధానికి విన్నవించారు జగన్. రుణ పరిమితిలో కోతలు వద్దని ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించి, రూ.32,625.25 కోట్ల పెండింగ్‌ బకాయిలు మంజూరు చేయాలన్నారు.

పోలవరం కోసం రాష్ట్రం ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్లు వెంటనే చెల్లించాలని, అదే సమయంలో పోలవరం పునరావాసానికి రూ.10,485.38 కోట్లు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు జగన్. తెలంగాణ డిస్కలం నుంచి రావాల్సిన రూ.6,886 కోట్లు ఇప్పించాలన్నారు. 12 జిల్లాలకు మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయాలని, కడపలో నిర్మించబోతున్న ఉక్కు కర్మాగారంకోసం ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని కోరారు. విశాఖ మెట్రో రైల్‌ ఏర్పాటుకు సహకారం అందించాలన్నారు.

ఏపీలోని వివిధ ప్రాజెక్ట్ లకు పర్యావరణ అనుమతులపై కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ అయ్యారు ఏపీ సీఎం జగన్. ఈరోజు రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలవబోతున్నారు. అందుబాటులో ఉన్న మరికొందరు కేంద్ర మంత్రుల్ని కూడా జగన్ కలుస్తారని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News