చంద్రబాబుపై వ్యతిరేకత మొదలైంది -జగన్
ఇప్పటికైనా దాడులు, దారుణాలు ఆపివేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు జగన్. ఇవి ప్రభుత్వ ప్రేరేపిత దాడులేనని అన్నారు.
కొత్త ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలంటే ఎక్కడైనా కాస్త టైమ్ పడుతుందని, కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వంపై చాలా త్వరగా వ్యతిరేకత వచ్చిందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పారు. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేతను ఆయన పరామర్శించారు. కేవలం వైసీపీ నేతలపైనే కాదని, చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై దాడులు కూడా పెచ్చుమీరాయని విమర్శించారు. వీటికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు జగన్.
ఇప్పటికైనా దాడులు, దారుణాలు ఆపివేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు జగన్. ఇవి ప్రభుత్వ ప్రేరేపిత దాడులేనని అన్నారు. నంద్యాలలో ఏకంగా వైసీపీ నాయకుడిని హత్య చేశారని, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. అక్కడికి కూడాా తాను వెళ్తానని, ప్రభుత్వం చేస్తున్న దారుణాలను దేశం మొత్తం చూసేలా చేస్తానని అన్నారు జగన్. అవసరమైతే హైకోర్టు, లేదా సుప్రీంకోర్టు తలుపుతడతామన్నారు. దేశం మొత్తం అన్ని రాజకీయ పక్షాలకు ఇక్కడ జరిదే దాడుల్ని వివరిస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున న్యాయపోరాటం చేస్తామన్నారు జగన్.
అసత్య హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు జగన్. తల్లికి వందనం పేరుతో మీకు 15వేలు, మీకు 15వేలు అంటూ కబుర్లు చెప్పారని, చివరకు ఆ పథకానికి మంగళం పాడారని అన్నారు. రైతు భరోసా ఇవ్వలేదని, మత్స్యకార భరోసా లేదని, విద్యా దీవెన, వసతి దీవెన కూడా అందించలేదని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందన్నారు. చివరిగా మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగకముందే ఆయన తన ప్రసంగం ముగించి వెళ్లిపోయారు జగన్.