వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఏ జిల్లా ఆదుకుంటుంది?

క్షేత్ర స్ధాయి సమాచారంతో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ఏ జిల్లాలో కూడా నూరు శాతం సీట్లను వైసీపీ గెలవటం కష్టమేనేమో అనిపిస్తోంది.

Advertisement
Update:2022-12-30 10:37 IST

పోయిన ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లలో అఖండ విజయం సాధించటానికి ప్రధాన కారణం నాలుగు జిల్లాలే అని చెప్పాలి. రాయలసీమలోని కడప, కర్నూలు, కోస్తా ప్రాంతంలోని నెల్లూరు, ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలోని నూరు శాతం సీట్లను వైసీపీనే గెలిచింది. కడపలోని పది సీట్లకు పది, కర్నూలు జిల్లాలోని 15కి 15 సీట్లు, నెల్లూరులోని 10కి పది, విజయనగరం జిల్లాలోని 9కి 9 సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. నాలుగు జిల్లాల్లోని 44 సీట్లూ వైసీపీనే గెలిచి ఫుల్ స్వీప్ చేస్తుందని ఎవరూ ఊహించి ఉండ‌రు.

పార్టీ గెలిచిన 151 సీట్లలో 44 సీట్లు పై నాలుగు జిల్లాల నుండే వచ్చాయి. వీటికి చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలు కాస్త అటు ఇటుగా మద్దతుగా నిలవటంతోనే 151 సీట్లొచ్చాయి. సరే అదంతా చరిత్రగా మారిపోయింది. మరి వచ్చే ఎన్నికల మాటేమిటి? అధికారంలో ఉన్న పార్టీ మీద జనాల్లో ఎంతో కొంత అసంతృప్తి సహజమే. అయితే ఈ అసంతృప్తి వ్యతిరేకంగా మారితే మాత్రం డెంజర్ బెల్స్ మోగినట్లే అనుకోవాలి.

క్షేత్ర స్ధాయి సమాచారంతో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ఏ జిల్లాలో కూడా నూరు శాతం సీట్లను వైసీపీ గెలవటం కష్టమేనేమో అనిపిస్తోంది. ఎందుకంటే చాలా జిల్లాల్లో పార్టీ నేతల మధ్య అంతఃకలహాలు ఎక్కువైపోతున్నాయి. కడప జిల్లాలో ప్రొద్దుటూరు, రాజంపేట, జమ్మలమడుగు, కర్నూలు జిల్లాలో నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలోని హిందుపురం, శింగనమల నియోజకవర్గాల్లో బాగా గొడవలు జరుగుతున్నాయి.

అలాగే ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, చీరాల, కృష్ణా జిల్లాలోని గన్నవరం, మైలవరం, విశాఖ జిల్లాలోని పాయకరావుపేట లాంటి మరికొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య బాగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలున్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీని నూరు శాతం ఏ జిల్లా ఆదుకుంటుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News