తండ్రీకొడుకుల మాట చెల్లుబాటవుతుందా..?

జ్యోతుల‌ నెహ్రూనే టీడీపీ తరపున పోటీచేస్తే గెలుపు కష్టమని సర్వేలో తేలిందట. బాటంశెట్టి ఇండిపెండెంటుగా అయినా పోటీచేస్తారని సమాచారం అందిందట.

Advertisement
Update:2023-01-19 08:19 IST

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలుగా పాపులరైన జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ విషయం రాజమండ్రి జిల్లాలో బాగా హాట్ టాపిక్ అయిపోయింది. నెహ్రూ, నవీన్ తండ్రీకొడుకులన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా కాపు సామాజికవర్గం కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటారు. జగ్గంపేట మాజీ ఎంఎల్ఏ అయిన నెహ్రూ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నవీన్ అయితే పిఠాపురం ఎంఎల్ఏగా కానీ, లేదా కాకినాడ ఎంపీగా పోటీచేయాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీచేయాల్సిందే అన్నట్లుగా తండ్రీకొడుకులు గ‌ట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే చంద్రబాబునాయుడు ఆలోచనలు మాత్రం వేరేగా ఉన్నాయట. నెహ్రూని జగ్గంపేటలో కాకుండా రాజానగరంలో పోటీచేయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఎందుకంటే జగ్గంపేటలో జ‌న‌సేన అభ్య‌ర్థిని పోటీ చేయించాల‌ని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ బాగా ఆస‌క్తి చూపిస్తున్నారు. అక్కడ బాటంశెట్టి సూర్యచంద్ర పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్నట్లు పవన్ గుర్తించారు. కాబట్టి సూర్యచంద్రకు జగ్గంపేట టికెట్‌పై హామీ ఇచ్చినట్లు సమాచారం.

జ్యోతుల‌ నెహ్రూనే టీడీపీ తరపున పోటీచేస్తే గెలుపు కష్టమని సర్వేలో తేలిందట. బాటంశెట్టి ఇండిపెండెంటుగా అయినా పోటీచేస్తారని సమాచారం అందిందట. అందుకనే రెండు పార్టీల మధ్య ఎలాగూ పొత్తుంటుంది కాబట్టి జగ్గంపేటను జనసేనకే వదిలేస్తే గెలుపు తేలికవుతుందని చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నారట. అందుకనే నెహ్రూని రాజానగరంలో పోటీచేయమని చెప్పారట. అయితే రాజానగరంలో పోటీచేయటం నెహ్రూకి ఏమాత్రం ఇష్టంలేదు. అందుకనే చంద్రబాబును కన్వీన్స్ చేసేందుకు ఈ మాజీ ఎంఎల్ఏ నానా అవస్థ‌లు పడుతున్నారు.

ఇక నవీన్ విషయానికి వస్తే తండ్రి, కొడుకులు ఇద్దరికీ టికెట్లు సాధ్యంకాదని చంద్రబాబు చెప్పారట. అయితే నవీన్ మాత్రం పట్టించుకోకుండా పిఠాపురంలో పోటీచేయబోయేది తానే అని ప్రచారం చేసుకుంటున్నారు. పిఠాపురంలో కుదరకపోతే కాకినాడ ఎంపీగా పోటీచేయటం ఖాయమని నవీన్ చెప్పుకుని తిరుగుతున్నారు. దీంతో తండ్రి, కొడుకుల వల్ల పార్టీ అంతా గందరగోళంగా తయారైంది. మరి వీళ్ళ మాట చెల్లుబాటవుతుందో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News