యువగళానికి పోలీసులే ప్రచారం కల్పిస్తున్నారా?

పాదయాత్రలో లోకేష్ అనుమతులను ఉల్లంఘించారంటూ పలమనేరులో పోలీసులు ప్రచార రథాన్ని సీజ్ చేశారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని టమోటా రైతులు, టీడీపీ నేతలతో పాటు కొందరు బీజేపీ నేతలు లోకేష్‌తో భేటీ అయ్యారు. దాంతో లోకేష్ పాదయాత్ర పెద్ద ఇష్యూ అయిపోయింది.

Advertisement
Update:2023-02-03 10:54 IST

లోకేష్ పాదయాత్ర యువగళానికి పోలీసులే ప్రచారం కల్పిస్తున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. విషయం ఏమిటంటే పాదయాత్రలో లోకేష్ అనుమతులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ పలమనేరులో పోలీసులు ప్రచార రథాన్ని సీజ్ చేశారు. ఆ తర్వాత లోకేష్, మాజీ మంత్రి అమర్నాథ‌రెడ్డికి పోలీసులకు పెద్ద వాగ్వాదం అయిన తర్వాత వాహనాన్ని విడిచిపెట్టారు. దాదాపు అర్ధగంట సేపు జరిగిన వాగ్వాదం వల్ల చుట్టుపక్కల జనాలంతా వచ్చి చేరారు. దాంతో లోకేష్ పాదయాత్ర పెద్ద ఇష్యూ అయిపోయింది.

ఇక్కడ గమనించాల్సిందేమంటే గడచిన ఐదు రోజులుగా లోకేష్ పాదయాత్ర గురించి జనాలు పెద్దగా పట్టించుకోవటంలేదు. ఒకవిధంగా ఐదు రోజుల పాదయాత్ర ఫెయిలైందనే చెప్పాలి. పాదయాత్ర కోసం టీడీపీ ఏర్పాటుచేసిన వలంటీర్లు, లోకేష్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది, టీడీపీ నేతలు మినహా మామూలు జనాలు పెద్దగా కనబడటంలేదు. ఈ పరిణామాలతో చంద్రబాబునాయుడుతో పాటు పార్టీలోని సీనియర్లంతా విస్తుపోతున్నారు.

పాదయాత్రకు ముందు వేసుకున్న అంచనాలు ఒకెత్తయితే ఇప్పుడు జరుగుతున్నది పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ కారణంగానే చేసేదిలేక ఎల్లో మీడియా కూడా లోకేష్ పాదయాత్ర వార్తలు, ఫొటోలను లోపలిపేజీలకు పరిమితం చేసేసింది. సరిగ్గా ఇలాంటి నేపథ్యంలోనే పలమనేరులో లోకేష్ వాహనాన్ని పోలీసులు అడ్డుకోవటం ఆశ్చర్యంగా ఉంది. అనుమతి లేకుండానే జనాలను ఉద్దేశించి లోకేష్ వాహనంపైకి ఎక్కి మైకులో మాట్లాడారట.

నేషనల్ హైవేపై మైకులో జనాలను ఉద్దేశించి మాట్లాడటాన్ని ప్రభుత్వం నిషేధించిందనే కారణంతో పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. నిజానికి పాదయాత్రలో జనాలు లేరని టీడీపీ వాళ్ళే ఇబ్బందులు పడుతుంటే మధ్యలో పోలీసులు వాహనాన్ని సీజ్ చేయటం అవసరమా అని వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పోలీసులు వాహనాన్ని సీజ్ చేయగానే చుట్టుపక్కల ప్రాంతాల్లోని టమోటా రైతులు, టీడీపీ నేతలతో పాటు కొందరు బీజేపీ నేతలు కూడా లోకేష్‌తో భేటీ అయ్యారు. ఫెయిలైన పాదయాత్రకు పోలీసులే ప్రచారం కల్పిస్తున్నారా అంటు అధికార పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. పోలీసులు చూసీ చూడనట్లుంటే అసలు పాదయాత్రను పట్టించుకునేవాళ్ళే ఉండరని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News