వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వాటాల కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందా?

కేంద్ర ప్రభుత్వం వాటాలను అమ్మేయడానికే కట్టుబడి ఉంటే.. వాటిని తెలంగాణ ప్రభుత్వం తరపున కొనుగోలు చేసి ఉద్యోగులు, కార్మికులకు భరోసా ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

Advertisement
Update:2023-04-10 11:08 IST

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు చాన్నాళ్లుగా నిరసనలు తెలియజేస్తున్నారు. కార్మిక సంఘాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితి తరపున కార్మికులు, ఉద్యోగులకు సంఘీభావం కూడా తెలియజేశారు. తాజాగా సీఎం కేసీఆర్ స్టీల్ ప్లాంట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మద్దతుగా కొనసాగించాలని కేసీఆర్ నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం వాటాలను అమ్మేయడానికే కట్టుబడి ఉంటే.. వాటిని తెలంగాణ ప్రభుత్వం తరపున కొనుగోలు చేసి ఉద్యోగులు, కార్మికులకు భరోసా ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణ కోసం మూలధనం, ముడి సరుకుల కోసం నిధులు సమకూర్చి.. నిబంధనల ప్రకారం ఉక్కు ఉత్పత్తులు కొనడానికి ప్లాంట్ యాజమాన్యం పిలిచిన ఎక్స్‌ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ (ఈఐఓ) బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనాలని నిర్ణయించారు.

తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ), ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ లేదా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తరపున ఈఐఓ బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఉన్నది. సింగరేణి సంస్థలో మెజార్టీ వాటా తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. ఆ సంస్థ అయితే టెక్నికల్‌గా కూడా ఎలాంటి అభ్యంతరం ఉండదు. దీనికి ప్రత్నామ్నాయంగా టీఎస్ఎండీసీ, నీటిపారుదల శాఖను కూడా సిద్ధంగా ఉండమని సీఎం కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్నది. నిధుల సమీకరణ కోసమే వైజాగ్ స్టీల్, ఎల్ఐసీ వంటి సంస్థలను ప్రైవేటుపరం చేస్తోంది. సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. గతంలో పార్టీ తరపున తమ గళాన్ని గట్టిగా వినిపించారు. తాజాగా ఎవరూ ఊహించని విధంగా వైజాగ్ స్టీల్ విషయంలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వల్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇరుకున పడే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం నిర్ణయంపై ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎప్పుడూ స్పందించలేదు. ఇది కచ్చితంగా ప్రజల్లో చర్చ జరుగుతుందని సీఎం కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం తరపున ఈఐఓ బిడ్డింగ్ ప్రతిపాదనల కోసం ఉన్నతాధికారుల బృందం విశాఖపట్నం వెళ్లనున్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లోనే ఆ బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులతో భేటీ కానున్నారు. ప్రస్తుతం యాజమాన్యానికి ఎన్ని నిధులు అవసరం? నిధులను తిరిగి చెల్లించే విధానాలు, నిబంధనలు, షరతులను ఉన్నతాధికారుల టీమ్ అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15లోగా బిడ్డింగ్ చేయాల్సి ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం యుద్దప్రాతిపదికన బిడ్లు సిద్ధం చేయనున్నది.

Tags:    
Advertisement

Similar News