పవన్‌ టీడీపీని కార్నర్‌ చేస్తున్నాడా..? – తెలుగు తమ్ముళ్లలో సీట్ల టెన్షన్‌

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు జైలు నుంచి ఎప్పుడు బయటికి వస్తారో తెలియని గందరగోళ, అయోమయ స్థితి ఏర్పడింది. దీంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయాయి.

Advertisement
Update:2023-10-28 08:16 IST

వచ్చే ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు కన్‌ఫర్మ్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ పక్క ఎన్నికలకు మరో 5 నెలలు మాత్రమే సమయం ఉండటం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా జైలులోనే ఉండటం ఆ పార్టీ నేతల్లో టెన్షన్‌ రేకెత్తిస్తోంది. ఇంతకీ వారి టెన్షన్‌కి ప్రధాన కారణమేంటంటే.. సీట్ల సర్దుబాటు వ్యవహారమే. రెండు పార్టీల మధ్య ఐక్య కార్యాచరణ అమలులోకి వస్తుండగా, మరోపక్క సీట్ల విషయంలోనూ పవన్, లోకేష్‌ మధ్య చర్చలు అయిపోయాయని, ఇక అధికారికంగా సీట్లు ప్రకటించడం ఒకటే మిగిలిందనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశమే ఇప్పుడు సీట్లు ఆశిస్తున్న తెలుగు తమ్ముళ్లను మరింత కలవరానికి గురిచేస్తోంది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు జైలు నుంచి ఎప్పుడు బయటికి వస్తారో తెలియని గందరగోళ, అయోమయ స్థితి ఏర్పడింది. దీంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయాయి. లోకేష్‌కి పార్టీని ముందుకు నడిపే సామర్థ్యం లేకపోవడం, భువనేశ్వరి బస్సు యాత్రలు చేస్తున్నా.. ప్రజల నుంచి ఎలాంటి స్పందనా కనిపించకపోవడం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ పూర్తిగా బలహీనపడిందని అంచనా వేసిన పవన్‌ కల్యాణ్‌ ఈసారి ఆ పార్టీకి తనతో పొత్తు తప్పనిసరి అని అర్థమైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీచేసే సీట్ల విషయంలో ఆయన ఎక్కువ సీట్లపైనే గురిపెట్టినట్టు తెలుస్తోంది. టీడీపీ కాస్త బలంగా ఉందని భావిస్తున్న సీట్లను పొత్తులో భాగంగా ఆయన కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. జనసేన ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రపై ఎక్కువగా కన్నేసినట్టు తెలుస్తోంది. వాటిలో పిఠాపురం, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు, నిడదవోలు, పి.గన్నవరం, కొత్తపేట, భీమిలి, పెందుర్తి, విశాఖ దక్షిణం లాంటి చాలా నియోజకవర్గాలను జనసేన అడుగుతోందని సమాచారం. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాల్లో పాతుకుపోయిన తెలుగు తమ్ముళ్లలో ఇప్పుడు ఈ వ్యవహారం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పవన్‌తో పొత్తుకు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్న వేళ.. సీట్ల కేటాయింపులోనూ పవన్‌కు ప్రాధాన్యత ఇస్తే.. తమ గతేమవుతుందోనని ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్టు తర్వాత ఆ పార్టీలో నాయకత్వ లోపం తేటతెల్లమైపోయింది. ఆ పార్టీని ముందుకు నడిపించే సరైన సారథి లేడనే విషయం ప్రజలకు అర్థమైంది. లోకేష్‌కి పార్టీని ముందుకు నడిపే సామర్థ్యం లేకపోవడం, నారా భువనేశ్వరి చంద్రబాబు సూచన మేరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం, బాబు అరెస్టు తర్వాత పార్టీని కాపాడుకునేందుకు చొరవ తీసుకొని ముందుకొచ్చిన బాలకృష్ణను పక్కన పెట్టేయడం, పార్టీలోని సీనియర్‌ నేతలైన అచ్చెంనాయుడు, యనమల రామకృష్ణుడు లాంటి వారిలోనూ ప్రజలను ఆకట్టుకునే సామర్థ్యం లేకపోవడంతో ఆ పార్టీ పూర్తిగా పవన్‌ కల్యాణ్‌ సినీ గ్లామర్‌పైనే ఆధారపడినట్టు స్పష్టమవుతోంది.

ఇటీవల రెండు పార్టీల ఐక్య కార్యాచరణ కోసం నిర్వహించిన సమావేశంలోనూ లోకేష్, టీడీపీ సీనియర్‌ నేతలు ఉన్నప్పటికీ.. పవన్‌ కల్యాణ్‌ మాత్రమే ఎట్రాక్షన్‌గా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ లేకపోతే ఆ పార్టీ పరిస్థితి మరింత అయోమయ స్థితిలో ఉండేదని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలను అర్థం చేసుకుంటున్న పవన్‌ కల్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక టీడీపీ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో లొంగి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అదే జరిగితే.. సీటుపై ఆశలు పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లకు నిరాశే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు ఏంచేయాలో అర్థంకాని గందరగోళ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుండటం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News