సీఐడీ రెడీ అవుతోందా..?
ఏ రకంగా చూసినా సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు పెద్ద షాకనే చెప్పాలి. దేశంలోని అత్యంత ఖరీదైన లాయర్లను రంగంలోకి దింపినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది.
స్కిల్ స్కామ్ లో చంద్రబాబును విచారించేందుకు సీఐడీ రెడీ అవుతోందా..? క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. తన అరెస్టు, రిమాండ్ కు సంబంధించి చంద్రబాబు సుప్రీంకోర్టులో 17ఏ సెక్షన్ తనకు వర్తించదని పిటీషన్ దాఖలుచేశారు. తనపై పెట్టిన కేసులు అక్రమమని, అరెస్టు, రిమాండ్ అన్యాయమని కోర్టులో వాదించారు. ఇదే సమయంలో చంద్రబాబు వాదనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ లాయర్ వాదనలు వినిపించారు. రెండువైపుల వాదనలు విన్న న్యాయమూర్తులు అనిరుధ్ బోస్, బేలా త్రివేది మంగళవారం తీర్పిచ్చారు.
ఈ తీర్పులో ఇద్దరు జడ్జీలు విరుద్ధమైన తీర్పులిచ్చారు. బోస్ ఏమో 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని, అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే అని చెప్పారు. అయితే త్రివేది ఏమో చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరంలేదన్నారు. 17ఏ అమాయకులను పోలీసులు వేధించకుండా ఏర్పాటు చేసిన సెక్షనే కానీ, అధికార దుర్వినియోగంతో అవినీతికి పాల్పడిన వారిని రక్షించటానికి కాదన్నారు. ఇక్కడే ఒక ట్విస్టు ఉంది.
అదేమిటంటే.. 17ఏ పై ఇద్దరు జడ్జీలు భిన్నమైన తీర్పులిచ్చినా అరెస్టు, రిమాండ్, విచారణలో ఏకాభిప్రాయాన్నే వ్యక్తంచేశారు. అరెస్టు, రిమాండు తప్పుకాదన్నారు. చంద్రబాబుకు విధించిన రిమాండులో తాము జోక్యం చేసుకోమన్నారు. ఏసీబీ కోర్టు విధించిన రిమాండు చెల్లుతుందని అలాగే సీఐడీ విచారణ చేసుకోవచ్చని స్పష్టంగా చెప్పారు. స్కిల్ స్కామ్ లో విచారణ చేసుకోవచ్చని జడ్జీలు తీర్పివ్వటం సీఐడీకి బాగా ప్లస్సయ్యింది. అలాగే తనపైన నమోదైన కేసులను క్వాష్ చేయాలన్న చంద్రబాబు పిటీషన్నే జడ్జీలు కొట్టేశారు.
ఏ రకంగా చూసినా సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు పెద్ద షాకనే చెప్పాలి. దేశంలోని అత్యంత ఖరీదైన లాయర్లను రంగంలోకి దింపినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. క్వాష్ పిటీషన్ను జడ్జీలు కొట్టేశారంటేనే చంద్రబాబుకు ఎంత మైనస్సో అర్థం చేసుకోవచ్చు. తాజా తీర్పు ప్రకారం కేసులో ఉన్న చంద్రబాబు అండ్ కో ను సీఐడీ విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు చంద్రబాబుకు పెద్ద దెబ్బనే చెప్పాలి.