టోటల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరేనా..?

ఉద్యోగ సంఘనేతల బృందం గవర్నర్ ను కలిసి ఏకంగా ప్రభుత్వంపైనే తీవ్రమైన ఆరోపణలు చేయటం మామూలు విషయంకాదు. గవర్నర్ ను కలిసేముందు దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరిగే ఉంటుంది.

Advertisement
Update:2023-01-21 11:24 IST

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా తయారైంది ఏపీ ప్రభుత్వ వ్యవహారం. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు క‌నిపెట్టాల్సిన బాధ్య‌త ఇంటెలిజెన్స్ విభాగానిదే. ఇంటెలిజెన్స్ విభాగమన్నది చాలా కీల‌క‌మైంది. రాష్ట్రంలో ఏమూల ఏమి జరుగుతున్నా ముందుగా దాన్ని ప‌సిగ‌ట్టి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ విభాగానిదే. అంతటి కీలకమైన విభాగం కొన్ని విష‌యాల్లో ఫెయిలైందనే చెప్పాలి.

దీనికి తాజా ఉదాహరణ ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవటమే. ఉద్యోగసంఘాల నేత సూర్యనారాయణ నాయక‌త్వంలో కొంతమంది నేతలు గవర్నర్ ను కలిసి ప్ర‌భుత్వంపై ఫిర్యాదులు చేయటం సంచలనంగా మారింది. తమకు ప్రభుత్వం సరిగ్గా జీతాలు ఇవ్వటంలేదని, ప్రతినెలా 1వ తేదీనే జీతాలిచ్చేట్లుగా చట్టం తేవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని సూర్యనారాయణ బృందం గవర్నర్ ను కలవటం కలకలం రేపుతోంది.

ఉద్యోగ సంఘనేతల బృందం గవర్నర్ ను కలిసి ఏకంగా ప్రభుత్వంపైనే తీవ్రమైన ఆరోపణలు చేయటం మామూలు విషయంకాదు. గవర్నర్ ను కలిసేముందు దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరిగే ఉంటుంది. అలాంటిది విషయం బయటకు పొక్కకుండా వ్యవహారాన్ని చాలా పకడ్బందీగా నడిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటానికి అవసరమైన మెటీరియల్ అంతా కలెక్ట్ చేశారు. ఓ నలుగురు కలిసి మెటీరియల్ ను డ్రాఫ్ట్ రూపంలో రెడీచేశారు. తర్వాత ఆ ఫిర్యాదులను అందరూ ఒకటికి రెండుసార్లు స్టడీ చేశారు.

అంతా ఫైనల్ అయిన తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు. అపాయిట్మెంట్ అడ‌గ‌టం.. గవర్నర్ అపాయిట్మెంట్ ఇవ్వ‌డానికి మధ్యలో రెండురోజుల వ్యవధి ఉందట. అయినా ఈ విషయం ప్రభుత్వానికి ఏమాత్రం తెలీలేదు. అసలు సూర్యనారాయాణ తరఫున గవర్నర్ అపాయిట్మెంట్ తీసుకున్నదెవరు అనే విషయాన్ని ప్రభుత్వం ఆరాతీస్తోంది. ఇన్ని దశాబ్దాల్లో గవర్నర్‌ను కలిసి ప్ర‌భుత్వంపై ఉద్యోగసంఘాలు ఫిర్యాదుచేయటం ఇదే మొదటిసారి. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేర్వేరుకాదు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయటం మామూలు విషయమే కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరంలేదు. గవర్నర్ ను ఎవరు అపాయిట్మెంట్ కోరినా వెంటనే ఆ విషయం ప్రభుత్వానికి తెలియాలి. అలాంటిది ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగసంఘాలే తనపై ఫిర్యాదు చేసేంతవరకు ప్రభుత్వానికి తెలీలేదంటే ఆశ్చర్యంగా ఉంది.

Tags:    
Advertisement

Similar News