ఆసక్తికరంగా ఏపీ రాజకీయ ముఖచిత్రం.. ఎన్నికల వేళ మారుతున్న సమీకరణాలు

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఒక అవినీతికరమైన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని.. విశాఖపట్నం సంఘ విద్రోహ శక్తులు, డ్రగ్ మాఫియాకు హబ్‌గా మారిపోయిందని అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు.

Advertisement
Update:2023-06-21 13:25 IST

ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయమే ఉన్నది. గత నాలుగేళ్లుగా బీజేపీతో వైసీపీ సన్నిహితంగా మెలిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ చీఫ్, ఏపీ సీఎం వైఎస్ జగన్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఎన్డీయేలో లేకపోయినా పలు మార్లు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో పొత్తులు, రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై ఆసక్తి నెలకొన్నది. బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ, ఇటీవల విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన తీవ్రమైన ఆరోపణల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఒక అవినీతికరమైన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని.. విశాఖపట్నం సంఘ విద్రోహ శక్తులు, డ్రగ్ మాఫియాకు హబ్‌గా మారిపోయిందని అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. అమిత్ షా చేసిన ఆరోపణలపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. విశాఖ సభలో చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపించగలరా అని అని సవాలు విసిరింది. అమిత్ షా వ్యాఖ్యల అనంతరం పల్నాడులో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పొత్తులపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని ప్రకటించారు. ఒకవైపు బీజేపీ అగ్రనాయకులు వైసీపీపై ఆరోపణలు చేయడం, మరోవైపు బీజేపీతో జట్టు కట్టేది లేదని వైసీపీ చీఫ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పడంతో ఏపీ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి బరిలోకి దిగుతాయనే విషయంపై క్రమంగా స్పష్టత వస్తున్నది. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. అయితే 2018 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి.. ఆ హామీని బీజేపీ నిలబెట్టుకోలేదనే కారణంతో చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో ప్రధాని మోడీ, అమిత్ షాపై చంద్రబాబు తీవ్రమైన విమర్శలు చేశారు. మోడీ పర్యటనలో టీడీపీ కార్యకర్తలు నల్ల బెలూన్లు ఎగరేయడం, తిరుపతికి వచ్చిన హోం మంత్రి అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేయడంపై బీజేపీకి ఆగ్రహాన్ని తెప్పించింది. చంద్రబాబు తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఎన్డీయే నుంచి బయటకు రావడమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.

ఇక 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఘన విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు మరోసారి బీజేపీకి దగ్గర కావాలనే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. గత నాలుగేళ్లుగా పలుమార్లు మోడీని కలవడానికి ప్రయత్నించినా ఆ అవకాశం రాలేదు. చివరకు హోం మంత్రి అమిత్ షాను ఇటీవల ఢిల్లీలో కలిశారు. చంద్రబాబుతో భేటీ అనంతరమే విశాఖ సభలో వైఎస్ జగన్‌పై అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. ఇన్నాళ్లూ వైసీపీని ఒక మిత్రపక్షంగా కేంద్రంలోని పెద్దలు భావించారు. కానీ ఒక్కసారిగా జగన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడంతో.. రాబోయే ఎన్నికల్లో ఏపీలో పొత్తులు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై స్పష్టత ఏర్పడింది.

హోం మంత్రి అమిత్ షాను చంద్రబాబు కలిసిన సమయంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. అంతే కాకుండా పవన్ కల్యాణ్ ఇప్పటికే పలుమార్లు బీజేపీ అగ్రనాయకులతో సమావేశం అయ్యారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మూడు పార్టీల పొత్తు పొడిచేలాగే కనపడుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ పట్ల బీజేపీకి సాఫ్ట్ కార్నర్ ఏర్పడినట్లు తెలుస్తున్నది.

చంద్రబాబు-అమిత్ షా భేటీ తర్వాత అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తెలంగాణలో కలిసి పని చేయడానికే అమిత్ షా ఆ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రధాన పోటీగా మారింది. బీజేపీ ఈ విషయంలో వెనుకబడింది. ఏపీ, తెలంగాణ కలిపి 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఉత్తరాదిలో ఈ సారి బీజేపీకి సీట్లు తగ్గుతాయనే రిపోర్టులు వస్తుండటం, కర్ణాటకలో ప్రతికూల ఫలితాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పార్లమెంట్ సీట్లపై బీజేపీ కన్ను పడినట్లు తెలుస్తున్నది.

తెలంగాణకు సంబంధించి బీజేపీకి ఒక స్పష్టమైన రాజకీయ అవగాహన ఉన్నది. కానీ ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటో ఆ పార్టీ నాయకులకు కూడాఅర్థం కావడం లేదు. అమిత్ షా ఒకవైపు వైసీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏపీకి గ్రాంట్ల రూపంలో రూ.23 వేల కోట్లు విడుదల చేసింది. దీనిపై రాజకీయ వర్గాల్లో లోతైన చర్చ జరిగింది. కాగా, ఏపీకి రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీనితో బీజేపీ పార్టీకి ఏం సంబంధం అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అంటున్నారు. ఆ గ్రాంటు ఏపీ పునర్విభజన చట్టాన్ని అనుసరించి ఇచ్చారు. అంతే కానీ వైసీపీ ప్రభుత్వంపై ప్రేమతో కాదని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.

రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి పోటీ చేసినా.. వైసీపీ పార్టీని ఎదుర్కోవడం వాటికి కష్టంగానే మారవచ్చు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లో చాలా ఆదరణ పొందాయి. ప్రజల ఖాతాల్లోకే నేరుగా రూ.54 వేల కోట్లు జమ చేశారు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం రూ.2.79 ల‌క్ష‌ల‌ కోట్లు ఖర్చు చేయగా.. అందులో 20 శాతం ప్రజల ఖాతాల్లోకే నేరుగా జమయ్యాయి.

ఒకవైపు ప్రతిపక్షాలు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకొని పోతోందని ఆరోపణలు చేసినా.. ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా.. సంక్షేమ పథకాల పేరుతో నేరుగా డబ్బు జమ చేయడాన్ని మాత్రం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆపడం లేదు. వైఎస్ జగన్ పథకాల లబ్దిదారులు వైసీపీకి పూర్తి అండగా ఉన్నారనేది అక్షర సత్యం. ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను కూడా వైఎస్ జగన్ పరిష్కరించుకుంటూ వస్తున్నారు. గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌ను ప్రకటించి.. ప్రభుత్వ ఉద్యోగుల కోపాన్ని కూడా చల్లార్చారు.

ఇక టీడీపీ, జనసేన ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. యువగళం పేరుతో నారా లోకేశ్ ఏపీలో యాత్ర చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా వారాహి యాత్ర ప్రారంభించారు. ఇలాంటి సమయంలో టీడీపీతో బీజేపీ కలిస్తే మంచి ఫలితాలు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. అధికార వైసీపీని ఎదుర్కోవడానికి మూడు పార్టీలు ఏకం కావల్సిన సమయం ఆసన్నమైందని బాబు అనుకుంటున్నారు. మరి వీరి పొత్తు పొడుస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News