జగన్‌ విద్యాసంస్కరణలపై మేధావుల ప్రశంసల జల్లు

అందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం (శ్రీకాకుళం) చైర్మన్‌ హెచ్‌. లజపతిరాయ్‌ బలపరిచారు.

Advertisement
Update:2024-02-06 12:01 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన విద్యాసంస్కరణలపై మేధావులు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రగతిపథంలో రాష్ట్ర విద్యా విధానం అనే అంశంపై సోమవారంనాడు విశాఖపట్నంలో జరిగిన సదస్సులో మేధావులంతా ఒకచోట చేరి రాష్ట్రంలో అమలవుతున్న విద్యాసంస్కరణలపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలవుతున్న విద్యాసంస్కరణలపై సానుకూల సమీక్ష చేయడానికి నాన్‌–పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది.

అందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం (శ్రీకాకుళం) చైర్మన్‌ హెచ్‌. లజపతిరాయ్‌ బలపరిచారు. నాణ్యమైన విద్యను అందిస్తూ, దాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్‌ ఎం. జగన్నాథరావు వివరించారు.

అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పిల్లలకు సాంకేతిక, నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి కేంద్రీకరించారని ఏయూ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ కె. శ్రీరామమూర్తి కొనియాడారు. అభివృద్ధికి ఆవల ఉన్న సామాజిక వర్గాలపై జగన్‌ ప్రభుత్వ విధానాలు సానుకూల ప్రభావం చూపుతున్నాయని ఏయూ విద్యా శాఖ అధిపతి టి. షరోన్‌ రాజు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లల పాఠశాల హాజరు గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు.

అక్షరాస్యతా రేటులో ఆంధ్రప్రదేశ్‌ దేశానికి మార్గదర్శకత్వం చూపుతుండడాన్ని రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ పి. విశ్వనాథం, సిహెచ్‌. సూర్యనారాయణ (ఏయూ కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌), రిటైర్డ్‌ లెక్చరర్‌ సి. వెంకటరావు ప్రశంసించారు.

విద్యార్థులు 21వ శతాబ్దిలోకి గర్వంగా అడుగుపెట్టడానికి అవసరమైన ప్రామాణిక ప్రగతిని, జ్ఞానాభివృద్ధిని, నైపుణ్యాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యాసంస్కరణల ద్వారా అందిస్తోందని కొనియాడారు.

Tags:    
Advertisement

Similar News