భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతం
హైదరాబాదు లోని స్కైరూట్ సంస్థ రూపొందించిన విక్రమ్-ఎస్ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది. షార్ కేంద్రంలోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి ఇస్రో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది.
అంతరిక్ష యాన రంగంలో భారత్ నూతన అధ్యాయాన్ని లిఖించింది. శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం (షార్) తొలిసారిగా ప్రయోగించిన ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది..
హైదరాబాదు లోని స్కైరూట్ సంస్థ రూపొందించిన విక్రమ్-ఎస్ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది. షార్ కేంద్రంలోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి ఇస్రో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ మూడు కస్టమర్ పేలోడ్లుతో అంతరిక్షలోకి దూసుకుపోయింది. ప్రయోగ సమయం కేవలం 4నిమిషాల 50 సెకండ్లు. భూ ఉపరితలం నుంచి 103 కిలోమీటర్ల ఎత్తులోని నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఉపగ్రహం భూమి మీద బంగాళఖాతం సముద్రం వరకు తీసుకువచ్చేలా రూపకల్పన చేశారు. భూమిపైకి తిరిగి వచ్చే సమయంలో గాలిలో తేమ, వాతావరణ పరిస్థితులు, తిరుగు ప్రయాణంలో వేగం వంటివి అంచనా వేస్తారు.
భారత అంతరిక్ష పరిశోధనా పితామహుడు విక్రమ్ సారాభాయ్ సేవలకు గుర్తుగా ఆయనకు నివాళిగా ఈ రాకెట్ కు విక్రమ్ అనే పేరు పెట్టారు. 6 మీటర్లు పొడవు, 543 కిలోల బరువు ఉన్న విక్రమ్- ఎస్ రాకెట్ లక్ష్యం 80 కిలోమీటర్లు కాగా, 89 కిలోమీటర్లు ప్రయాణించినట్టు ఇస్రో ప్రకటించింది.
భారత అంతరిక్ష చరిత్రలో దీన్ని ఓ మైలురాయిగా, కొత్త యుగంగా స్కైరూట్ ఎయిరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు పవనకుమార్ చందన పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగానికి ఇది ప్రారంభం అని అన్నారు. అందుకే దీనికి ఆరంభ్ అని పేరు పెట్టామన్నారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సైతం ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రత్యేకంగా హాజరయ్యారు.
కనీసం 150 స్టార్టప్‌లు అంతరిక్ష రంగంలో ఆసక్తి కనబరిచాయని ఇన్-స్పేస్(IN-SPACE) చైర్మన్ డాక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. 150 స్టార్టప్‌లు అంతరిక్షంలోకి వెళ్లేందుకు దరఖాస్తులు పంపాయని, అయితే ఐదు మందికే ఆథరైజేషన్ ఇచ్చామని తెలిపారు.