మంత్రి పదవికి రాజీనామా చేస్తా..! అప్పలరాజు హాట్ కామెంట్స్
మంత్రి వర్గంలో కొత్తగా కొన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలనుకుంటే.. తానే మొదటిగా రిజైన్ చేస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మంత్రి అప్పలరాజు. మంత్రివర్గ కూర్పు అంశం సీఎం విచక్షణ అధికారమని స్పష్టం చేశారు.
రెండేళ్లకోసారి మంత్రి మండలిని మార్చేస్తానంటూ సీఎం జగన్ అధికారం చేపట్టిన తొలి రోజుల్లో చెబితే అందరూ లైట్ తీసుకున్నారు. తీరా తొలి విడత మంత్రి వర్గ విస్తరణతో అందరికీ జగన్ ఆలోచన అర్థమైంది, అన్ని వర్గాలకు అవకాశాలిచ్చే క్రమంలో కొందరికి మంత్రి పదవి మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయింది. ఇప్పుడు మరోసారి విస్తరణ అంటున్నారు. అవకాశం రాని మరికొందరికి ఈసారి ఛాన్స్ దక్కుతుందని చెబుతున్నారు. మాజీ మంత్రులకి మరో దఫా అవకాశం దక్కుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పదవి ఊడిపోయేవారి లిస్ట్ లో సీదిరి అప్పలరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ విషయం ఆయన చెవిన కూడా పడినట్టుంది. మంత్రి వర్గ విస్తరణ విషయంపై ముందుగానే హింట్ ఇచ్చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.
మత్స్యకారులకు సీఎం జగన్ మంచి గౌరవం ఇచ్చారని చెబుతున్న ఆయన, తమ మత్స్యకార వర్గానికి సంబంధించి నలుగురిని ఎమ్మెల్సీలు చేశారన్నారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ అనే కంటే వైఎస్సాఆర్ బహుజన పార్టీ అంటే బాగుంటుందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో మంత్రి వర్గంలో కొత్తగా కొన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలనుకుంటే.. తానే మొదటిగా రిజైన్ చేస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మంత్రి అప్పలరాజు. మంత్రివర్గ కూర్పు అంశం సీఎం విచక్షణ అధికారమని స్పష్టం చేశారు. ఆ మాటకొస్తే వైసీపీలోని 151 మంది ఎమ్మెల్యేలు, 44 మంది ఎమ్మెల్సీలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టేందుకు అర్హత కలిగినవారేనని అన్నారు.
హింటిచ్చేశారా..?
కొత్త ఎమ్మెల్సీలు ఎన్నికైన తర్వాత మంత్రి వర్గ కూర్పు ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి పదవులు కోల్పోయేవారికి ముందుగానే జగన్ హింటిచ్చారా అనేది మాత్రం తేలడంలేదు. మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తే, ముందుగా తానే రిజైన్ చేస్తానని సీదిరి అప్పలరాజు చెప్పడం దేనికి సంకేతం అనేది తేలాల్సి ఉంది. అప్పలరాజు లాంటి ఒకరిద్దరికి అసలు విషయం తెలిసిపోయిందనే వార్తలు కూడా వినపడుతున్నాయి. మరి ఆశావహుల్లో ఈసారి ఎవరెవరు అమాత్యులుగా ఎంపికవుతారో, మిగిలిన ఏడాదిన్నర కాలంలో వారు ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో వేచి చూడాలి.