ఏపీలో అక్టోబర్ 1 నుంచి దుల్హన్ పథకం అమలు

అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ హైకోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించారు. అందులో వైయస్సార్ కల్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా పథకాలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవోను అందజేశారు.

Advertisement
Update:2022-09-15 18:27 IST

ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 1తేదీ నుంచి దుల్హన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. గత టీడీపీ హయాంలో ఈ పథకం కింద ప్రభుత్వం మైనార్టీ వర్గానికి చెందిన యువతుల వివాహానికి గాను రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేసేది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలు కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో దుల్హన్ పథకం అమలు చేయడం లేదని మైనార్టీ పరిరక్షణ సమితి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇదివరకే ఒక దఫా విచారణ జరుగగా.. తాజాగా ఇవాళ మరోసారి విచారణ జరిగింది.

ఈ సందర్భంగా దుల్హన్ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ హైకోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించారు. అందులో వైయస్సార్ కల్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా పథకాలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవోను అందజేశారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి దుల్హన్ పథకం మాదిరే మరో పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నట్లు వివరించారు.

గత ప్రభుత్వం ముస్లిం మైనార్టీ యువతుల వివాహానికి గాను రూ. 50 వేల ఆర్థిక సహాయం అందజేస్తుండగా.. ఆ మొత్తాన్ని వైసీపీ ప్రభుత్వం రూ.లక్షకు పెంచి అందజేయనున్నట్లు తెలియజేశారు. కాగా ఇటీవల వైసీపీ ప్రభుత్వం వివిధ వర్గాలకు చెందిన వారికి వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందజేసేందుకు గాను రూ. 40 వేల నుంచి రూ. 1.50 లక్షలను ఆర్థిక సాయంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మైనారిటీల కోసం వైయ‌స్సార్ షాదీ తోఫా పేరిట పెళ్లి చేసుకునే ముస్లింలకు రూ. లక్ష సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News