కేసీఆర్ కోరితే బీఆరెస్ కు మద్దతుపై ఆలోచిస్తాం... వైసీపీ నేత సజ్జల
వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి బిఆరెస్ పార్టీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ కోరితే ఆ విషయంపై ఆలోచిస్తామని సజ్జల వెల్లడించారు.
రైతు సంక్షేమంతో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా దేశ రాజకీయాల్లో విప్లవాత్మక విధానలను తీసుకు వచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కృత నిశ్చయంతో కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ స్ఫూర్తితో టిఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితి(బిఆరెస్)గా ఆవిష్కరించి జాతీయ స్థాయిలో నూతన ప్రస్థానానికి ఆయన శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సాధ్యమైనంత త్వరలో బిఆర్ ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు కెసిఆర్ ఉద్యుక్తులవుతున్నారు. ఇప్పటికే మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో బిఆర్ఎస్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఆ పార్టీ పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నరు. పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి బిఆరెస్ పార్టీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ కోరితే ఆ విషయంపై ఆలోచిస్తామని సజ్జల వెల్లడించారు. అటువంటి ప్రతిపాదన ఏదైనా వస్తే ముఖ్యమంత్రి జగన్ అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని సజ్జల మీడియాతో చెప్పారు.
రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎవరు ఎక్కడినుంచైనా పోటీ చేయవచ్చునని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా బిఆరెస్ పోటీ చేయొచ్చని దానిలో అభ్యంతరం ఏముంటుందని అన్నారు.పోటీ చేస్తే మంచిదే కదా అని అన్నారు. అయితే, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచన వైసీపీకి లేదని సజ్జల స్పష్టం చేశారు. విభజన హామీలపై తాము పోరాటం చేయడంలేదనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తాము ఈ విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పారు.