"సీఎం పవన్ కల్యాణ్".. సినిమా తీస్తానంటున్న ఏపీ మంత్రి
పవన్ కల్యాణ్ కు ఏపీలో 175 నియోజకవర్గాల పేర్లు తెలుసా అంటూ ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం అవుతారట అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆయన సినిమాల్లో పవర్ స్టార్ అని, పాలిటిక్స్ లో మాత్రం ప్యాకేజ్ స్టార్ అని ఎద్దేవా చేశారు.
"సీఎం పవన్ కల్యాణ్" అనే పేరుతో సినిమా ఎవరైనా తీస్తే తానే నిర్మాతగా ఖర్చులన్నీ భరిస్తానని చెప్పారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అనకాపల్లి జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సీఎం పవన్ కల్యాణ్ అనే సినిమా టైటిల్ చెప్పారు. పవన్ కల్యాణ్ పేరు చెబితేనే ఒంటికాలిపై లేచే మంత్రి ఆయనతో సినిమా ఎందుకు తీస్తానన్నారబ్బా అని అనుమానం రావచ్చు. సినిమా తీస్తానంటూ ఆయన పవన్ పై సెటైర్లు పేల్చారు. రియల్ లైఫ్ లో ఆయన ఎలాగూ సీఎం కాలేరని, కనీసం సినిమాలో అయినా పీకేని సీఎం చేద్దామంటూ ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన ఫ్యాన్స్ కలలు కంటున్న మాట వాస్తవమే. ఆయన ఎక్కడ కనపడినా, ఏ సభకు వచ్చినా, చివరకు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి వచ్చినా సరే.. సీఎం సీఎం అంటూ రచ్చ చేస్తుంటారు అభిమానులు. ఈ వ్యవహారంపైనే మంత్రి గుడివాడ సెటైర్లు వేశారు. 'సీఎం పవన్ కళ్యాణ్' పేరుతో సినిమా తీస్తే పవన్ ను కనీసం తెరపై అయినా సీఎంగా చూసుకోవచ్చని, నిజ జీవితంలో ఆయన ఎలాగూ సీఎం కాలేరని అన్నారు.
175 నియోజకవర్గాల పేర్లు తెలుసా..?
పవన్ కల్యాణ్ కు ఏపీలో 175 నియోజకవర్గాల పేర్లు తెలుసా అంటూ ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం అవుతారట అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆయన సినిమాల్లో పవర్ స్టార్ అని, పాలిటిక్స్ లో మాత్రం ప్యాకేజ్ స్టార్ అని ఎద్దేవా చేశారు. 2024ఎన్నికల్లో టీడీపీకి మహాప్రస్థానం ఖాయమని చెప్పారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఏ పథకాన్నయినా, ఏ వ్యవస్థనైనా తీసేసే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు.
అప్పుడెక్కడున్నావ్ పవన్..
పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు కూడా ఫైర్ అయ్యారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని చంద్రబాబు అణిచివేసినప్పుడు పవన్ ఎక్కడ దాక్కున్నారంటూ ప్రశ్నించారు. ముద్రగడను చంద్రబాబు ప్రభుత్వం వేధించినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదన్నారు. హరి రామజోగయ్య దీక్ష చేస్తేనే పవన్ కల్యాణ్ స్పందించారని, టీడీపీ ప్రభుత్వంలో మాట్లాడని పవన్, జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు.