ఏపీలో రాహుల్ యాత్రకు అంతమంది జనాలా..? కారణం ఏంటి..?
ఏపీలోనే కాదు, రాహుల్ యాత్ర చేసిన ప్రాంతాల్లో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు భారీగా జనం తరలి వస్తున్నారు. బీజేపీ శకం ముగుస్తోందనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు.
ఇతర రాష్ట్రాల్లో భారత్ జోడో యాత్రకు జనాలు వచ్చారంటే అక్కడ కాంగ్రెస్ కి స్థానిక బలం ఉండబట్టే. కానీ, ఏపీలో రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ ని దాదాపుగా నామరూపాల్లేకుండా చేసింది. అయినా కూడా రాహుల్ గాంధీ యాత్రకు జనం తరలి వచ్చారంటే కారణం ఏంటి..? ఏపీలో కాంగ్రెస్ బలం పెరిగిందని కాదు, బీజేపీ ప్రభుత్వంపై ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందని అర్థం. ఏపీలోనే కాదు, రాహుల్ యాత్ర చేసిన ప్రాంతాల్లో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు భారీగా జనం తరలి వస్తున్నారు. బీజేపీ శకం ముగుస్తోందనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు.
సామాన్యులకే పెద్దపీట..
రాహుల్ గాంధీ పాదయాత్రలో ఆయన చుట్టూ పెద్ద నాయకులెవరూ ఉండట్లేదు. కండువాలు, దండలు, భజనలు.. ఇలాంటివేవీ కనపడటంలేదు. సామాన్యులే ఆయన చుట్టూ ఉంటున్నారు. విద్యార్థులు, దివ్యాంగులు, యువత.. వీరితోనే ఎక్కువ సమయం యాత్రలో కలసి నడుస్తున్నారు రాహుల్ గాంధీ. ఏపీలో కూడా అమరావతి రైతులు, పోలవరం నిర్వాసితులు ఆయనతో సమావేశమయ్యారు. ఇలాంటి అంశాలే రాహుల్ యాత్రపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఏపీలో కూడా ఆయన పాదయాత్రకు జనం పెద్ద సంఖ్యలో రావడానికి కారణం అదే.
కాంగ్రెస్ లో చురుకు..
కాంగ్రెస్ ని వదిలి వెళ్లలేక, ఇతర పార్టీల్లో కలవలేక ఇబ్బందిపడుతున్న చాలామంది సీనియర్లు ఏపీలో వానప్రస్థంలో ఉన్నారు. అలాంటి వారంతా ఇప్పుడు రాహుల్ పర్యటనతో ముందుకొస్తున్నారు. కొంతమంది పాదయాత్రలో ఆయన్ను కలిశారు. 2024లో ఏపీలో కాంగ్రెస్ అద్భుతాలు సృష్టిస్తుందనే అంచనాలు లేవు కానీ, బీజేపీపై ఉన్న వ్యతిరేకత కాస్తో కూస్తో కాంగ్రెస్ కి కలిసొస్తుందనే భావన నాయకుల్లో ఉంది.
ఆకట్టుకుంటున్న రాహుల్ ఆహార్యం..
రాహుల్ గాంధీ గతంలో ఎప్పుడూ క్లీన్ షేవ్ తో కనిపించేవారు. అడపాదడపా గడ్డం పెంచినా.. అది కూడా ఓ స్టైల్ స్టేట్ మెంట్ లానే ఉండేది. ఇప్పుడు రాహుల్ పాదయాత్రలో మాసిన గడ్డంతోనే ముందుకు నడుస్తున్నారు. రాహుల్ ఆహార్యంపై కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెల్ల టీషర్ట్, గోధుమరంగు ఫ్యాంట్, మాసిన గడ్డంతో రాహుల్ గాంధీ కొత్త తరహాగా కనిపిస్తున్నారని అంటున్నారు. మిగతా రాష్ట్రాల సంగతి పక్కనపెడితే ఏపీలో రాహుల్ యాత్రకు ఆమాత్రం జనాలు రావడం పార్టీ శ్రేణుల్లో సంతోషాన్ని నింపింది.