చంద్రబాబు భాష మారింది.. అసలేం జరుగుతోంది..?
చంద్రబాబులో మార్పు స్పష్టంగా కనపడుతోంది. ఎన్నికలనాటికి ఏదో ఒక అలజడి రేపాలనే ఉద్దేశంతోనే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. ఓటమి భయం ఉంది కాబట్టే బాబు కొత్త వ్యూహంతో వస్తున్నారని, రాష్ట్రంలో అలజడులకు కారణం అవుతున్నారని ఆరోపిస్తున్నారు.
నిన్న పుంగనూరులో..
నన్ను బెదిరించడం మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు.
కర్రలతో వస్తే కర్రలతో వస్తా. రౌడీలకు రౌడీగా ఉంటా.
వైసీపీ నేతలు వస్తే కర్రలతో బడితె పూజ చేయండి(టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి)
నేడు శ్రీకాళహస్తిలో..
కర్రకు కర్ర, దెబ్బకు దెబ్బ
మీరు ఒక దెబ్బ కొడితే మేం రెండు కొడతాం
రెచ్చిపోతే ముక్కలు ముక్కలు చేసి పిండి చేస్తాం..
ఇవీ చంద్రబాబు మాటలు. గతంలో ఎప్పుడూ ఇంత ఆవేశంగా చంద్రబాబు ఊగిపోలేదు. ఘాటైన పదాలు వాడినా కూడా మనిషి ప్రశాంతంగానే కనిపించేవారు. కానీ ఇటీవల కాలంలో ఆయన ప్రసంగాలన్నీ రెచ్చగొట్టే ధోరణిలోనే కొనసాగుతున్నాయి. నాయకుల్ని, కార్యకర్తల్ని తన మాటలతో రెచ్చగొడుతున్నారు బాబు. దీని పర్యవసానాలే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణలు. ఈ ఘర్షణల్లో ఇరు వర్గాలు నష్టపోతున్నాయి. మధ్యలో పోలీసులు కూడా ఆస్పత్రిపాలయ్యారు.
ఎందుకీ గొడవలు..?
చంద్రబాబు పర్యటన లేకపోతే కచ్చితంగా అంగళ్లులో గొడవ జరిగేది కాదేమో, పుంగనూరులో తలలు పగిలేవి కావేమో. పర్యటన పేరుతో స్థానిక నాయకులను తిట్టిపోస్తూ తీవ్ర దూషణలు చేస్తున్న చంద్రబాబు పరోక్షంగా టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు. ఆవేశంలో వారు రెచ్చిపోతే, అటువైపు వైసీపీ వాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. ఫలితంగా గొడవలు జరుగుతున్నాయి.
ఎందుకీ మార్పు..?
చంద్రబాబులో మార్పు స్పష్టంగా కనపడుతోంది. ఎన్నికలనాటికి ఏదో ఒక అలజడి రేపాలనే ఉద్దేశంతోనే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. ఓటమి భయం ఉంది కాబట్టే బాబు కొత్త వ్యూహంతో వస్తున్నారని, రాష్ట్రంలో అలజడులకు కారణం అవుతున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల ఆరోపణల్లో నిజం ఎంతుందో చెప్పలేం కానీ, చంద్రబాబులో, ఆయన మాటల్లో మార్పు స్పష్టంగా తెలుస్తోంది.