ఆ ఒక్క వీడియో ఎలా లీక్ అయింది.. ఈసీకి సజ్జల సూటి ప్రశ్నలు
మాచర్ల నియోజకవర్గం మొత్తంలో ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని ఈసీ అంగీకరించిందని, మరీ ఆ వీడియోలను బయటపెట్టకుండా ఎవరు ఆపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఘటనలపై ఎలక్షన్ కమిషన్‌కు ప్రశ్నలు సంధించారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి. తమకు కొన్ని సందేహాలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాలని ఎలక్షన్ కమిషన్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు సజ్జల.
ప్రధానంగా మూడు ప్రశ్నలు ఎలక్షన్ కమిషన్‌కు సంధించారు సజ్జల. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం వీడియో వెబ్ కాస్టింగ్ నుంచి వస్తే ఈసీ విడుదల చేయకుండా వీడియో ఎలా లీక్ అయిందో చెప్పాలన్నారు. వీడియో నిజమా.. కాదా అని తేల్చుకోకుండా ఎలక్షన్ కమిషన్ వేగంగా ఎందుకు స్పందించిందో క్లారిటీ ఇవ్వాలన్నారు.
ఇక మాచర్ల నియోజకవర్గం మొత్తంలో ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని ఈసీ అంగీకరించిందని, మరీ ఆ వీడియోలను బయటపెట్టకుండా ఎవరు ఆపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో వీడియోలు విడుదల చేసి దోషులకు శిక్ష పడకుండా ఎవరు అడ్డుకుంటున్నారని ఈసీని ప్రశ్నించారు.
అమాయక ఓటర్లపై తెలుగుదేశం పార్టీ గూండాలు దాడికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ.. ఆ ఘటనలపై ఎందుకు చర్యలు ప్రారంభించలేదో చెప్పాలన్నారు సజ్జల. ఈ ఘటనలన్నింటిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.