పోటీ ఎక్కువైంది.. నియోజకవర్గాలు సరిపోవడంలేదు
టీడీపీ, జనసేనతో పాటు ఎన్ని పార్టీలు కలసి పనిచేసినా సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని అన్నారు వైవీ సుబ్బారెడ్డి.
తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ మరీ ఎక్కువగా ప్రయోగాలు చేయలేదు, ఇటు ఏపీలో కూడా వైసీపీకి అలాంటి పరిస్థితే ఉంది. సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ పక్కనపెట్టినా, సర్వేల పేరుతో మరో నలుగురైదుగుర్ని మాత్రమే దూరం పెట్టే అవకాశముంది. మిగతా టీమ్ అలాగే పోటీకి దిగుతుంది. కాదని మార్పులు చేర్పులకు దిగితే అసంతృప్తుల్ని అదుపులో పెట్టడం జగన్ కి సాధ్యమయ్యే పనికాదు. ఇప్పటికే పార్టీలో టికెట్లకోసం కాంపిటీష్ పెరిగిపోయింది. వైసీపీలో తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువైందని అన్నారు ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి. పోటీ ఎక్కువై నియోజకవర్గాలు సరిపోవటం లేదన్నారు. తమ పరిస్థితి అలా ఉంటే.. జనసేన పార్టీకి కనీసం 15 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష..
టీడీపీ, జనసేనతో పాటు ఎన్ని పార్టీలు కలసి పనిచేసినా సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. టీడీపీ అధికారంలో ఉన్నప్పడు రాష్ట్రాన్ని దోచుకున్నారని తాము మొదటి నుంచీ ఆరోపిస్తున్నామని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలలో కోర్టుల ద్వారా పూర్తి విచారణ జరుగుతుందని తెలిపారు.
తెలంగాణలో పోటీపై..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం వైసీపీకి లేదని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపైనే తమ దృష్టి ఉందన్నారు. ఏపీలో ఏయే పార్టీలు కలసి వచ్చినా తమకు పోటీయే లేదన్నారు వైవీ. కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర విభజన సమయంలో ప్రతిపాదించిన విధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పంపకాలు జరిగాయని తెలిపారాయన. ఏపీకి అన్యాయం జరుగుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. తమ ప్రభుత్వం అవినీతిరహిత విధానాలు అవలంబిస్తోందని.. మద్యం, ఇసుక పాలసీలపై ఎటువంటి విచారణలు జరిపినా తాము సిద్ధమని స్పష్టం చేశారు.