పవన్‌కల్యాణ్‌ జనసైనికులకు ఏం చెప్తావ్‌ - చేగొండి

లోకేశ్‌బాబు ఆశిస్తున్నట్లుగా చంద్రబాబునే పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా చేయటానికి మీ ఆమోదం ఉందా అంటూ జనసేనాని పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించారు.

Advertisement
Update:2023-12-22 16:09 IST

తెలుగుదేశం - జనసేన కలిసి అధికారంలోకి వస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లోకేశ్‌ చేసిన కామెంట్స్‌పై కాపు సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య స్పందించారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో పవన్‌కల్యాణ్‌కు పలు ప్రశ్నలు సంధించారు.

లోకేశ్‌బాబు ఆశిస్తున్నట్లుగా చంద్రబాబునే పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా చేయటానికి మీ ఆమోదం ఉందా అంటూ జనసేనాని పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించారు హరిరామజోగయ్య. మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు, బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి రావాలనుకుంటున్న జనసైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు కులాల నాయకులే రాజ్యమేలుతున్నారని లేఖలో పేర్కొన్నారు చేగొండి. 80 శాతం జనాభా ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మోక్షమెప్పుడని లేఖలో వరుస ప్రశ్నలు సంధించారు.




పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు, బలహీన వర్గాలకు ఒక దారి చూపిస్తారని.. నీతిమంతమైన పాలన అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పాలని పవన్‌ను కోరారు చేగొండి. ఈ ప్రశ్నలన్నింటికి జనసైనికులు సంతృప్తికరమైన సమాధానాలు ఆశిస్తున్నారని.. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో వైఖరిని స్పష్టం చేయాలని పవన్‌ను లేఖలో కోరారు.

Tags:    
Advertisement

Similar News