పవన్ బుజ్జగింపు.. హరిరామ జోగయ్య దీక్ష విరమణ..
ఇది మూర్ఖపు ప్రభుత్వం అని, మొండి ప్రభుత్వం అని అన్నారు పవన్ కల్యాణ్. పవన్ సూచనతో ఏకీభవించిన జోగయ్య దీక్ష విరమించారు. పవన్ లాంటి నాయకులు రాష్ట్రానికి అవసరం అని చెప్పారు. పవన్ సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు.
కాపు రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ ఏపీ సీఎం జగన్ కి డెడ్ లైన్ పెట్టి మరీ హరిరామజోగయ్య ఆమరణ దీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఆయన దీక్ష చేపట్టగానే పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. కానీ హరిరామ జోగయ్య ఆస్పత్రిలో కూడా నిరసన చేపట్టారు. మందులు వేసుకోకుండా మొండికేశారు. దీంతో పవన్ కల్యాణ్ ఆయనకు ఫోన్ చేసి బుజ్జగించారు. ఆయన సలహాలు, అనుభవం ఈ తరానికి అవసరం అని, మందులు వేసుకోకుండా ఆరోగ్యం పాడు చేసుకోవడం సరికాదని నచ్చజెప్పారు. కాపుల రిజర్వేషన్లు వేరే విధంగా సాధించుకుందామని బతిమిలాడారు. పవన్ సూచన మేరకు తాను దీక్ష విరమించినట్టు ప్రకటించారు హరిరామ జోగయ్య. ఆయన్ని ఏలూరు ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు.
కాపు రిజర్వేషన్లకు సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఏపీలో 5శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హరిరామ జోగయ్య ఏపీ సీఎం జగన్ కి లేఖ రాశారు. డెడ్ లైన్ పూర్తి కావడంతో ఆయన దీక్షకు దిగారు. పోలీసులు ఆయన్ను ఆస్పత్రికి తరలించడంతో పవన్ కల్యాణ్ స్పందించారు. త్వరలో తాను నేరుగా వచ్చి హరిరామ జోగయ్యను కలుస్తానని చెప్పారు. రిజర్వేషన్ల కోసం రాజకీయ ఆలోచన చేద్దామన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో పనిచేస్తానన్నారు. ఇది మూర్ఖపు ప్రభుత్వం అని, మొండి ప్రభుత్వం అని అన్నారు పవన్ కల్యాణ్. పవన్ సూచనతో ఏకీభవించిన జోగయ్య దీక్ష విరమించారు. పవన్ లాంటి నాయకులు రాష్ట్రానికి అవసరం అని చెప్పారు. పవన్ సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు.
వైసీపీని ఇరుకున పెట్టినట్టేనా..?
కాపుల రిజర్వేషన్ విషయంలో వైసీపీని ఇరుకున పెట్టాలనేది జనసేన ఆలోచన. హరిరామ జోగయ్య నిరాహార దీక్షపై ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు కూడా. దీంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. జోగయ్యను ఆస్పత్రికి తరలించడంపై కాపు నాయకులు తీవ్రంగా స్పందించారు. వైసీపీకి వ్యతిరేకంగా ఏలూరు ఆస్పత్రి వద్ద నినాదాలు చేశారు. చివరకు ఆయన దీక్ష విరమించడం, పనిలో పనిగా పవన్ ని పొగడ్తల్లో ముంచెత్తడం, ఆయన సీఎం కావాలని ఆశించడం.. ఈ వ్యవహారమంతా వైసీపీకి మింగుడుపడలేదు. హరిరామ జోగయ్య ఆమరణ దీక్ష వ్యవహారం ఏపీలో వైసీపీని ఇరుకున పెట్టిందనే చెప్పాలి.