ఏపీలో H3N2 వైరస్.. రెండు నెలల్లో 21 కేసులు

H3N2 Virus in Andhra Pradesh: H3N2 వైరస్ ప్రాణాంతకం కాదని, అయితే సరైన చికిత్స అవసరం అని చెబుతున్నారు అధికారులు. అపోహలు పెట్టుకోవద్దని సూచించారు.

Advertisement
Update:2023-03-09 20:03 IST

H3N2 Virus in Andhra Pradesh: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న చిన్న పిల్లల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో.. కొంతమంది వృద్ధులు కూడా ఇలాంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు చెబుతున్నారు. దీనికి కారణం H3N2 వైరస్ అని నిర్థారించారు వైద్యులు.


ఈ వైరస్ గతంలో గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో కనపడిందని, ఆ తర్వాత దాని జాడ లేదని, ప్రస్తుతం విశాఖలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు ఏపీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌.

ముందు జ్వరం, తర్వాత లంగ్స్ ఇన్ఫెక్షన్..

దగ్గు, జలుబుతో ఈ వైరస్ లక్షణాలు మొదలవుతాయి. ఆ తర్వాత జ్వరం వస్తుంది. దీన్ని పట్టించుకోకపోతే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇలా ఇన్ఫెక్షన్ సోకిన కేసులు కూడా ఇటీవల ఏపీలో బయటపడినట్టు తెలుస్తోంది. ఏపీలో H3N2 వైరస్ కేసులు జనవరిలో 12, ఫిబ్రవరిలో 9 నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు.


ఈ వైరస్ సోకినట్టు నిర్థారణ అయినా, ఆయా లక్షణాలు ఉన్నా కూడా విద్యార్థులని స్కూళ్లకి పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు డాక్టర్ వినోద్ కుమార్.

అపోహలు వద్దు..

H3N2 వైరస్ ప్రాణాంతకం కాదని, అయితే సరైన చికిత్స అవసరం అని చెబుతున్నారు అధికారులు. అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. బయట నుంచి ఇంటికి రాగానే చేతులు శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం ఈ వైరస్ ద్వారా వచ్చినదిగానే భావించాలన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వైరస్ ద్వారా ఇన్ ఫ్లూయెంజా వ్యాపిస్తోందని, వైద్యుల సలహాల‌ మేరకు యాంటిబయాటిక్స్ వాడాలన్నారు.


ఫీవర్ సర్వే..

మరోవైపు ఏపీలో వారం రోజులపాటు ఫీవర్ సర్వే చేపట్టాలని కూడా అధికారులు నిర్ణయించారు. అటు ఎండ ప్రభావం పెరగడంతో వడదెబ్బకు గురికాకుండా ప్రజల్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు విలేజ్ క్లినిక్‌ ల స్థాయిలో సిద్ధం చేసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.

Tags:    
Advertisement

Similar News