కర్నూలులో జ్యుడిషియల్ అకాడమీ ఉత్తర్వులు..
వాటిని ఆమోదించిన ప్రభుత్వం.. తాత్కాలికంగా మంగళగిరిలో, శాశ్వత ప్రతిపాదికన కర్నూలులో అకాడమీని ఏర్పాటు చేస్తామని ఉత్తర్వులు ఇచ్చింది.
కర్నూలును న్యాయ రాజధాని చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం కోర్టు చిక్కుల కారణంగా ఆ చట్టాన్ని వెనక్కు తీసుకుంది. అయితే న్యాయ వ్యవస్థకు సంబంధించిన విభాగాలను కర్నూలులో ఏర్పాటు చేసే పక్రియను కొనసాగిస్తోంది. తాజాగా రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చే నిమిత్తం ఏర్పాటు చేస్తున్న ఈ అకాడమీని శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ప్రస్తుతానికి తాత్కాలికంగా మంగళగిరిలోని అద్దె భవనంలో అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్టు తన ఉత్తర్వులలో వెల్లడించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి జ్యుడిషియల్ అకాడమీ లేదు. ఈ నేపథ్యంలో అకాడమి ఏర్పాటుకు హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ నుంచి ప్రభుత్వానికి సిఫార్సులు అందాయి. వాటిని ఆమోదించిన ప్రభుత్వం.. తాత్కాలికంగా మంగళగిరిలో, శాశ్వత ప్రతిపాదికన కర్నూలులో అకాడమీని ఏర్పాటు చేస్తామని ఉత్తర్వులు ఇచ్చింది.
సిబ్బంది మంజూరు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వేరుగా ఇస్తామని వెల్లడించింది. ఇప్పటికే కర్నూలుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర లోకాయుక్తా కార్యాలయాలను తరలించింది.