ఆ రూట్లో ఆలస్యానికి అలవాటు పడిన వందే భారత్..

ఆ రూట్లో వందే భారత్ ఆలస్యం కావడం ఇదే తొలిసారి కాదు. ప్రారంభం తర్వాత పలుమార్లు ఇదే రైలు ఆలస్యంతో ప్రయాణికులను చికాకు పెట్టింది.

Advertisement
Update:2023-06-14 08:52 IST

టికెట్ బాదుడికి సిద్ధపడి మరీ వందే భారత్ రైలెక్కారంటే కాస్త అర్జంట్ గా పని పెట్టుకున్నారనుకోవాలి. అయితే ఆరైలే పదే పదే ఆలస్యం అవుతుంటే ఇంకేం చేయాలి. మిగతా చోట్ల ఎలా ఉందో కానీ.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశాఖ-సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య తిరుగుతున్న వందే భారత్ రైలు పదే పదే ఆలస్యమై ప్రయాణికుల్ని అవస్థలకు గురిచేస్తోంది. తాజాగా మూడు గంటలు ఆలస్యమైంది వందే భారత్.

పట్టాలు తప్పిన గూడ్స్..

అనకాపల్లి జిల్లాలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో ఆ రూట్లో కొన్ని రైళ్లు రద్దయ్యాయి మరికొన్ని ఆలస్యమయ్యాయి. బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్‌ రైలు.. తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య ఈ తెల్లవారు ఝామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. అందులో వందే భారత్ కూడా ఉంది.

ఈరూట్లో వందే భారత్ ఆలస్యం కావడం ఇదే తొలిసారి కాదు. ప్రారంభం తర్వాత పలుమార్లు ఇదే రైలు ఆలస్యంతో ప్రయాణికులను చికాకు పెట్టింది. గతంలో రాళ్లదాడితో మూడుసార్లు వందే భారత్ ఆలస్యంగా నడిచింది. తాజాగా గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మరోసారి ఈ మార్గంలో వెళ్లే వందే భారత్ పై ఆ ప్రభావం పడింది. విశాఖ- లింగంపల్లి, జన్మభూమి, విశాఖ-విజయవాడ ఉదయ్ ఎక్స్ ప్రెస్, విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు ఈరోజు రద్దయ్యాయి. విశాఖతోపాటు దువ్వాడ రైల్వే స్టేషన్లలో పలు రైళ్లు నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Tags:    
Advertisement

Similar News