వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు ఇప్పుడు వైసీపీలో చేరారు. టీడీపీలో ఉన్నప్పుడు తనకు జరిగిన అవమానాలను ఆయన మీడియా ముందు బహిర్గతం చేశారు. బాధలో ఉన్న తనను సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారని అన్నారు. వైసీపీ కండువా కప్పుకునే సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సీఎం జగన్ కి రెండు చేతులు జోడించి దండం పెట్టారు. జగన్ నాయకత్వంలో వైసీపీ గెలుపు కోసం తన శాయశక్తులు ధారపోస్తానన్నారు గొల్లపల్లి.
లోకేష్ పై తీవ్ర ఆరోపణలు..
టీడీపీలో లోకేష్ బాధితులు కూడా చాలామంది ఉన్నారు. అందులో గొల్లపల్లి సూర్యారావు కూడా ఒకరని తేలిపోయింది. పార్టీకోసం నిబద్ధతతో పని చేసిన తనను టీడీపీ దారుణంగా అవమానించిందని అన్నారు సూర్యారావు. నారా లోకేష్ కూడా తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారాయన. ఉంటే ఉండు.. పోతే పో అన్నట్లు చూశారని, అధికారం కోసం చంద్రబాబు మౌన మునిగా మారారని ఆరోపించారు. లోకేష్ వ్యవహారాలన్నీ దుర్మార్గంగా ఉంటాయని చెప్పారు. బాధలో ఉన్న తనను జగన్ అక్కున చేర్చుకున్నట్టు తెలిపారు సూర్యారావు.
2014లో రాజోలునుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన సూర్యారావు, 2019లో జనసేన అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఇప్పటి వరకు టికెట్ పేరుతో ఊరించి చివరకు మోసం చేశారు చంద్రబాబు. దీంతో ఆయన వైసీపీలో చేరారు. సీఎం జగన్ స్వయంగా కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరపున సూర్యారావు బరిలో దిగుతారని సమాచారం.